ఫలించిన ఎంపీ రంజిత్‌ రెడ్డి మంత్రాంగం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా తాండూరు సీటు పంచాయతీని సీఎం కేసీఆర్‌ చాకచక్యంగా పరిష్కరించారు. అక్కడ్నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి బరిలోకి దిగేందుకు శత విధాల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య సయోధ్య నెరిపేందుకు సీఎం కేసీఆర్‌ చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డిని రంగంలోకి దించినట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో సీఎం అప్పగించిన బాధ్యతను రంజిత్‌ రెడ్డి సమర్థవంతంగా పోషించారని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. దాంతో రోహిత్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి రాజీకి వచ్చారనీ, ఆ తర్వాతే సీఎం రోహిత్‌ రెడ్డికి తాండూరు టికెట్‌ ను కేటాయించారని ఆ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

Spread the love