రెండవ దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి

– ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విపి.గౌతమ్‌
నవతెలంగాణ- ఖమ్మం
జిల్లాలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్‌, ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వి.పి. గౌతమ్‌ తెలిపారు. శుక్రవారం నూతన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో విపి. గౌతమ్‌, పార్లమెంట్‌ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్‌ సంజరు జి. కోల్టేతో కలిసి పోలింగ్‌ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ సిబ్బంది రెండో ర్యాండమైజేషన్‌లో అసెంబ్లీ సెగ్మెంట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1459 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, వీటికి ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారి, ఓపిఓలను కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు ప్రకారం 20 శాతం అదనంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని 355 పోలింగ్‌ కేంద్రాలకు, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్న 290 పోలింగ్‌ కేంద్రాలకు, మధిర అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్న 268 పోలింగ్‌ కేంద్రాలకు, వైరా అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని 216 పోలింగ్‌ కేంద్రాలకు, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని 294 పోలింగ్‌ కేంద్రాలకు పారదర్శకంగా ఎన్‌.ఐ.సి. సాఫ్ట్వేర్‌ వినియోగిస్తూ ఆన్లైన్లో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్‌, డి.మధుసూదన్‌ నాయక్‌, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్‌లు మయాంక్‌ సింగ్‌, మిర్నల్‌ శ్రేష్ఠ, జిల్లా రెవిన్యూ అధికారి రాజేశ్వరి, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, కలెక్టరేట్‌ ఏవో అరుణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love