Thursday, July 16, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గిరిజన రైతు ఆత్మహత్య బాధాకరం..

గిరిజన రైతు ఆత్మహత్య బాధాకరం..

- Advertisement -

 మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి
నవతెలంగాణ-సిర్పూర్ (టి)

మండలంలోని హిరాపూర్ గ్రామానికి చెందిన గిరిజన రైతు టేకం పెంటు ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూమి తమ చేతుల నుంచి పోతుందనే ఆవేదన, భయంతొ యువ రైతు ప్రాణాలను బలితీసుకుందని గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న టేకం పెంటుకు గురువారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహంతో ఆస్పత్రి ఆవరణలో వివిధ గిరిజన తెగల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కొలవార్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుర్సా పోచయ్య మాట్లాడుతూ.. హిరాపూర్ గ్రామానికి చెందిన తొమ్మిది మంది ఆదివాసీ గిరిజన రైతులకు సుమారు 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూ పట్టాలు మంజూరు చేసిందన్నారు. ఆ భూములనే ఐదేళ్ల క్రితం కాగజ్‌నగర్‌కు చెందిన కకోల్ వేణుగోపాల్ రైతులకు తెలియకుండా తన పేరుపై పట్టాలు చేయించుకున్నాడని ఆరోపించారు. అప్పటి నుంచి గిరిజన రైతులను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తూ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు.

ఈ ఏడాది బాధిత రైతులు తమ భూమిలో పత్తి సాగు చేయగా, వారిని అడ్డుకోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు. పోలీసులు మృతుడు టేకం పెంటు తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడంతో, తనను కూడా పిలుస్తారనే భయంతో పెంటు తీవ్ర మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. గిరిజనుల భూములకు రక్షణ లేకపోతే వారి జీవితాలకు భరోసా ఎక్కడ ఉంటుంది?” అని బుర్సా పోచయ్య ప్రశ్నించారు.

మృతికి కారణమైన వ్యక్తిపై హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు, భూకబ్జా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కోరారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే హిరాపూర్ గ్రామానికి చెందిన తొమ్మిది మంది గిరిజన రైతుల భూ సమస్యను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో జిల్లా కొలవార్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డప్పు బాపు, టేకం బిక్షపతి, రంగయ్య, శ్రీనివాస్, హనుమంతు తదితర గిరిజన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -