రాయిగూడెం గ్రామ రవాణా వ్యధను తీర్చాలి

– అనాదిగా రవాణా సౌకర్యం అస్తవ్యస్తం ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
రాయిగూడెం గ్రామ రవాణా వ్యథను తీర్చాలీని ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు. మండల పరిధిలోని రాయిగూడెం గ్రామ ప్రజల రవాణా వ్యవస్థ ఒక వైపు ఊరవాగు మరోవైపు కిన్నెరసాని వాగు ఉండడంతో అనాదిగా రవాణా వ్యవస్థ గ్రావెల్‌ రోడ్డుపై గుంతలతో అస్తవ్యస్తంగా, అంతంత మాత్రంగానే ఉన్న విషయం తెలిసిందే. గ్రామం రెండు వాగుల మధ్య ఉండడం, ఆ గ్రామానికి ఉన్న రెండు గ్రావెల్‌ రోడ్లూ రెండు వాగులపై నుంచి ఉండడంతో ఆ గ్రామ ప్రజల రవాణా వ్యవస్థ తీరని వ్యధగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల, జనాభా ప్రాతిపదికన రాయిగూడెం గ్రామానికి మండల కేంద్రానికి మధ్య ఉన్న కిన్నెరసాని వాగు పై వంతెన నిర్మాణం చేపట్టడం అత్యంత వ్యయ ప్రయాసలతో ముడిపడి ఉంది. దానికి స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెడితే తప్ప మరో మార్గం కనుచూపు మేరలో లేదు. కిన్నెరసాని వాగు పై బ్రిడ్జి నిర్మాణం పనులకు ముందు ఊరవాగు పై కల్వర్టు నిర్మాణం, 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆ ప్రాంత వాసులు స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా అధికారులు రవాణా సమస్యను తీరుస్తారని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. కల్వర్టు, బీటీ రోడ్డు ఏర్పాటుతో రాయిగూడెం ప్రజల రవాణా సౌకర్యం కొంత మెరుగు పడి వర్షాకాలంలో సైతం మండల కేంద్రానికి, పట్టణాలకు అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలు సాగించడానికి, అలాగే రైతులు పండించిన పంటలను పట్టణాల్లో నేరుగా అమ్ముకోవడానికి రవాణా మార్గం సుగమం అవుతుందని వారి ఆశ. దాంతో మా వ్యవసాయ పరమైన కష్టాలు చాలా వరకు తీరుతాయని రాయిగూడెం ప్రజానీకం దీనంగా పాలకుల, అధికారుల వైపు చేతులు జోడిస్తున్నారు.
రాయిగూడెం ప్రజల సమస్యలను పలుమార్లు స్వయంగా వెళ్లి చూసిన ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షురాలు, ఆళ్ళపల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ఊరవాగుపై కల్వర్టు నిర్మాణం, బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆ ప్రాంత వాసులతో పయనమై మంగళవారం మణుగూరులో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే, రేగా కాంతారావును మర్యాద పూర్వకంగా కలిసి రవాణా సమస్యను పరిష్కరించాలని కోరారు. దానికి ప్రభుత్వ విప్‌ సానుకూలంగా స్పందించారని ఎంపీపీ చెప్పారు. ఎంపీపీ వెంట రాయిగూడెం గ్రామస్థులు ముడిగ లక్ష్మినర్సు, ఇర్ప కన్నయ్య, సత్యం, బట్టు బాబు, పూనెం సూరయ్య, గొగ్గెల సాంబశివరావు, జి.సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love