నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజల వద్దకే పాలన అనే విధానాన్ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆచరణలో చూపిస్తున్నారు.గత వారం రోజులు గ్రామాలు వారి పోడు పట్టాలు జాబితా చేతబట్టుకుని తానే స్వయంగా లబ్దిదారులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పాస్ బుక్స్ పంపిణీకి బయలు దేరిన ఆయన కన్నాయిగూడెం వెళ్తుండగా ఊరి పొలిమేరలో ఓ రైతు తన పొలం లో దుక్కి చేయడం కనిపించింది.తన వాహనం ఆపి అధికారులను పిలిచి ఈ రైతు పేరు జాబితాలో ఉందా అని అడిగారు.ఉందని అధికారులు పాస్ పుస్తకం చూపడం వెంటనే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పోడు లోనే సున్నం లక్ష్మణ్ రావు అనే గిరిజన రైతుకు అందజేసారు.దీంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం కన్నాయిగూడెం (491),కావడిగుండ్ల(219), గుమ్మడవల్లి(53), నందిపాడు(306), దిబ్బ గూడెం(159), మొద్దులు మడ(39), కొత్త మామిల్ల వారిగూడెం(75), తిరుమలకుంట(84), పాత రెడ్డి గూడెం(131),లో పర్యటించి తానే స్వయంగా లబ్దిదారులకు అందజేసారు.ప్రతీ గ్రామంలోను ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట పోడు భూమి పట్టా లో కావాలని అడిగే వారని,నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పట్టాలు పంపిణీ సాకారం అవుతుందని హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ వరలక్ష్మి,సర్పంచ్ లు గొంది లక్ష్మణ్ రావు,కంగాల భూ లక్ష్మీ,ఊకే వీరాస్వామి,మహేశ్వరరావు, కొర్సా రాములమ్మ, కుంజా లక్ష్మి, సున్నం సరస్వతి,మొడియం నాగమణి, బీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు పుల్లారావు,వెంకన్న బాబు,ఎంపిటిసిలు, ఉప సర్పంచ్ లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.