నవతెలంగాణ- అశ్వారావుపేట
ధరణి లో లోపాలను సరిచేసి రైతులకు వారసత్వ పట్టాలు ఇచ్చి ఆర్ధిక ఇబ్బందుల నుండి రక్షించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సంఘం మండల కమిటీ సమావేశాన్ని సోమవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో మండల అధ్యక్షుడు తగరం జగన్నాధం అద్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ తాతల వారసత్వంగా ఉన్న పట్టా భూములకు సైతం ధోరణి లోని సాంకేతిక కారణాలతో నేడు పట్టాలు పొందలేక పోవడం రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.తరతరాలు గా సాగు చేస్తూ,పూర్వ పట్టాలు ఉన్నప్పటికి నేడు ఆధారాలు లేకపోవడంతో అందులో ఆయిల్ ఫాం లాంటి ఉద్యాన పంటలు సాగు చేసినా ప్రభుత్వ రాయితీలు పొందలేక ఆర్ధిక ఇబ్బందులు గురి అవుతున్నారని విచారం వ్యక్తం చేసారు.ఇటీవల సంభవించిన వర్షాలకు నష్టపోయిన రైతుల పంట సర్వే చేయడంలో వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలం అయిందని అన్నారు. సాగులో ఉన్న ప్రతీ పోడు దారునికి పట్టాలు ఇవ్వాలని, పట్టాలు ఇచ్చిన వాటిల్లో కొలతల్లో వ్యత్యాసం ఉందని వీటిని సరిచేసి గిరిజన రైతులకు న్యాయం చేయాలన్నారు.లక్ష రూపాయలు ఋణం మాఫీని వడ్డీతో సహా ఏక సమయంలో రద్దు చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గడ్డం సత్యనారాయణ,కలపాల భద్రం,గడ్డం వెంకటేశ్వరరావు,సీసం రాముడు లు పాల్గొన్నారు.