– పార్టీల వారీగా బి.ఎల్.ఓ లను నియమించాలి – అదనపు కలెక్టర్ రాంబాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
రెండు నెలల్లో ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున గుర్తింపు పొందిన పార్టీల వారీగా బి.ఎల్.ఓ లను నియమించుకోవాలని అదనపు కలెక్టర్, అశ్వారావుపేట నియోజక వర్గం ఎన్నికల అధికారి పర్సా రాంబాబు రాజకీయ పార్టీలు ప్రతినిధులకు సూచించారు. బదిలీ పై కొత్తగూడెం లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మొదటి సారిగా మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.మొదటి సారి కావడం పార్టీల వారీగా నియమితులైన ప్రతినిధులను ఆయన పరిచయం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీల,ప్రభుత్వ బి.ఎల్.ఒ లు సమన్వయంతో పనిచేస్తేనే నాణ్యమైన,పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందుతుందని అన్నారు.పారదర్శకమైన ఓటర్ల జాబితా నే పటిష్టమైన ఎన్నికల ప్రక్రియకు దోహదం చేస్తుందని తెలిపారు.సవరించి ఎన్నికల నియమావళి ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు నాలుగు నెలలకు ఒకసారి దరఖాస్తు చేసుకు ఓటు హక్కు పొందవచ్చని అన్నారు.అర్హులైన ప్రతీ పౌరుడు ఓటు హక్కు పొందడమే ద్యేయంగా ఎన్నికల కమీషన్ పనిచేస్తుంది అని అన్నారు.ఇదంతా నెరవేరాలంటే రాజకీయ పార్టీల జోక్యం అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు.సమీక్ష అనంతరం స్థానిక వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసే ఎన్నికల సామాగ్రి స్ట్రాంగ్ రూం ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట డి.టి సుచిత్ర, ఎలక్షన్ డి.టి వీరభద్ర నాయక్, దమ్మపేట, అన్నపురెడ్డి పల్లి, చండ్రుగొండ తహశీల్దార్ లు ముజాహిద్దీన్, జగదీశ్వర్ ప్రసాద్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చిరంజీవి, మండల కమిటీ సభ్యులు గంగరాజు, సీపీఐ జిల్లా నాయకులు సలీం, మండల నాయకులు రామక్రిష్ణ, కాంగ్రెస్ నాయకులు రాంబాబు, బీఎస్పీ నాయకులు ప్రసాద్ లు పాల్గొన్నారు.