మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించాలి

– అఖిలపక్ష భేటీలో ప్రతిపక్ష పార్టీలు
– నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించాలని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఆదివారం నాడిక్కడ పార్లమెంట్‌లో లైబ్రరీ భవన్‌ లో కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళ రిజర్వేషన్‌ బిల్లుపై మెజార్టీ రాజకీయ పార్టీలు బలంగా లేవనెత్తాయి. వివిధ పార్టీల నేతలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రవేశపెట్టాలని, ఏకాభిప్రాయంతో ఆమోదం పొందించాలని కోరాయి.
సమావేశానంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్‌ బిల్లు కోసం పార్టీల డిమాండ్‌పై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. కాశ్మీర్‌లో ప్రాణత్యాగం చేసిన భద్రతా దళాల సిబ్బందికి అఖిలపక్ష సమావేశంలో నివాళులుఅర్పించినట్టు మంత్రి తెలిపారు.
సీపీఐ(ఎం) ఎంపీ వి శివదాసన్‌ మాట్లాడుతూ కార్మికులు, రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలపై చర్చించాలి. ఎన్‌టీసీ మిల్లు కార్మికులు జీతాలు లేకుండా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను విడిగా పరిగణించాలి. కొత్త పార్లమెంటు భవనంలో ఉపరాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేసినట్టు ప్రకటన హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశ వైవిధ్యాన్ని పూర్తిగా తిరస్కరించే ఇలాంటి వైఖరిని సరిదిద్దాలని శివదాసన్‌ డిమాండ్‌ చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. హిందీ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే మహిళ బిల్లు ఆమోదం పొందాలని అన్ని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయని అన్నారు. ఇది పార్లమెంటు సాధారణ సమావేశమని ప్రభుత్వం తమకు తెలియజేసిందని చౌదరి అన్నారు. ”దాని ఉద్దేశం ఏమిటో ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. ఇది ఏదైనా కొత్త ఎజెండాతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది” అని ఆయన అన్నారు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, చైనాతో సరిహద్దులో పరిస్థితి వంటి అంశాలను సమావేశంలో తమ పార్టీ ప్రస్తావించిందని అన్నారు.
బీజేపీ మిత్రపక్షం, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం గణేష్‌ చతుర్థి శుభ సందర్భంగా పార్లమెంట్‌ కొత్త భవనానికి మారనున్నట్లు పటేల్‌ తెలిపారు. కొత్త పార్లమెంట్‌ భవనం నుంచి కొత్త శకం ప్రారంభం కావాలని, మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని బీజేడీ నేత పినాకి మిశ్రా అన్నారు.
అఖిలపక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి, లోక్‌సభ ఉపనేత రాజ్‌ నాథ్‌ సింగ్‌, రాజ్యసభ నేత, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్‌ గోయల్‌, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, సహాయ మంత్రులు అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, వి. మురళీధరన్‌, మాజీ ప్రధాని హెచ్‌ డి దేవగౌడ (జేడీఎస్‌), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), వైకో (ఎండీఎంకే), అధిర్‌ రంజన్‌ చౌదరి, ప్రమోద్‌ తివారీ (కాంగ్రెస్‌), తిరుచ్చి శివ, కనిమొళి (డీఎంకే), డెరిక్‌ ఓబ్రెయిన్‌ (టీఎంసీ), శివదాసన్‌ (సీపీఐ(ఎం), బినరు విశ్వం (సీపీఐ), వి. విజయసాయి రెడ్డి (వైసీపీ), కె. రామ్మోహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌ (టీడీపీ), కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు (బీఆర్‌ఎస్‌), ప్రఫుల్‌ పటేల్‌ (ఎన్సీపీ అజిత్‌ పవర్‌ వర్గం), వందన చౌహాన్‌ (ఎన్సీపీ శరద్‌ పవర్‌ వర్గం), రామ్‌ గోపాల్‌ యాదవ్‌, ఎస్టి హాసన్‌ (ఎస్పీ), పినాకి మిశ్రా, సస్మిత్‌ పాత్ర (బీజేడీ), మనోజ్‌ ఝా (ఆర్జేడీ), లలన్‌ సింగ్‌ (జేడీయూ), సంజరు సింగ్‌ (ఆప్‌), తంబిదొరై (అన్నాడీఎంకే)
ఇదే ఎజెండా
తొలిరోజు 75 ఏండ్ల పార్లమెంట్‌ చరిత్రపై చర్చ జరగనుంది. మంగళవారం కొత్త పార్లమెంటు భవనానికి సమావేశాలు మారనున్నాయి. దీనికి ముందు ఎంపీల గ్రూప్‌ ఫోటో సెషన్‌ ఉంటుంది. మంగళవారం గణేశ చతుర్థి ప్రత్యేక పూజల అనంతరం కొత్త పార్లమెంట్‌ భవనంలో ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇచ్చిన అంశాల కంటే వేరే ఎజెండా లేదని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం ప్రకటించలేదు. కొత్త పార్లమెంటుకు వెళ్లడం, వివాదాస్పద ఎన్నికల కమిషన్‌ బిల్లుతో సహా ఐదు బిల్లులను పరిగణనలోకి తీసుకోవడం ఎజెండాగా ఉంది. అఖిలపక్ష సమావేశంలో సర్క్యులేట్‌ చేసిన బిల్లుల్లో ఎన్నికల సంఘం సభ్యులను నియమించే అధికారం కేంద్రానికి పూర్తిగా కల్పించే బిల్లును చేర్చలేదు. ఈ బిల్లును పరిగణనలోకి తీసుకోవడం లేదా అని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించగా.. పరిశీలిస్తున్నామని బదులిచ్చారు. పోస్టాఫీసు బిల్లు, న్యాయవాదుల సవరణ బిల్లు, ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు వంటి బిల్లులను కూడా ప్రత్యేక సెషన్‌లో పరిశీలిస్తారు.
బీసీ, మహిళా బిల్లుల ఆమోదానికి ఒత్తిడి పెంచుతాం :నామా నాగేశ్వరరావు
బీసీ, మహిళా బిల్లుల ఆమోదానికి ఒత్తిడి పెంచుతామని బీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు వివిధ అంశాలను లేవనెత్తారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ సమావేశాలు సజావుగా జరిపేందుకు, అన్ని పార్టీల వారి సంపూర్ణ సహకారం కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్లమెంట్‌ ఉభయ సభల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు గళం ఎత్తుతారని అన్నారు.
ఓబీసీలు, మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారని అన్నారు. బీసీలు, మహిళా హక్కుల సాధనకు, వారికి సమున్నత స్థానం కల్పించేందుకు బీఆర్‌ఎస్‌ తరపున పార్లమెంట్‌ లో పెద్ద ఎత్తున గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. బీసీ, మహిళా రెండు బిల్లులు ఈ ప్రత్యేక సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదించేలా పోరాడతామని చెప్పారు. మిగతా అన్ని సమస్యలపైనా కేంద్రాన్ని నిలదీస్తామని నామ అన్నారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు బిల్లుపై తెలంగాణ మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు, వారి హక్కులు కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందని చెప్పారు.

Spread the love