చమురుపై ఆధిపత్యం కోసమే ట్రంప్ ఆరాటం
మోడీ విశ్వగురు కాదు..విశ్వ బానిస : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
యుద్ధ విమోచన కోసం అందరూ ఆలోచించాలి : రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పు ఉందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘యుద్ధం వద్దు -ప్రపంచ శాంతి కావాలి’ అని కోరుతూ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం- ప్రపంచానికి విఘాతం అనే అంశంపై మంగళవారం నల్లగొండలో టీఎస్‌యూటీఎఫ్, సీఐటీయూ, పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు ప్రసంగిస్తూ.. అమెరికా అధ్యక్షులు ట్రంప్ రౌడీలా వ్యవహరిస్తూ ప్రపంచదేశాలపై ఆధిపత్యం సాగించా లని ఆకాంక్షిస్తున్నారని, అందులో భాగంగానే వెనిజులా అధ్యక్షున్ని అరెస్టు చేసి నిర్బంధించారని చెప్పారు. ఇరాన్, వెనిజులా దేశాల్లో ఉన్న చమురు నిల్వలను ఆధీనంలోకి తెచ్చుకోవాలనే కుట్రతో యుద్ధం ప్రారంభించారన్నారు. ఇరాన్ దేశంలో అణు ఆయుధాలు, అణు బాంబుల నిల్వలు ఉన్నాయనే సాకుతో యుద్ధం ప్రారంభించిన ట్రంప్ పదిరోజుల్లో ఆ దేశం తమ ఆధీనం లోకి వస్తుందని కలలుగన్నారని చెప్పారు. ఇరాన్‌ను రాతియుగానికి నెట్టేస్తా మని మొదట్లో ప్రకటించారని, ఇజ్రాయిల్ అమెరికా దాడులపై ఇరాన్ ప్రతిఘ టించి ”ప్రాణాలైనా అర్పిస్తాం.. అమెరికాకు లొంగిపోం” అంటూ సాహసో పేతంగా యుద్ధం చేసిందన్నారు. యుద్ధం వల్ల అమెరికా సైతం ఆర్థికంగా నష్టపోతున్నదని, యుద్ధం ఆపాలని ఆ దేశ ప్రజలు కోరుతున్నప్పటికీ కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసం యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. ట్రంప్ యుద్ధకాంక్షను ఆ దేశ ప్రజలతోపాటు ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తోందని చెప్పారు.
అమెరికా చెప్పుచేతల్లో కీలుబొమ్మ..
భారత ప్రధాని మోడీ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ.. అమెరికా చెప్పుచేతల్లో కీలుబొమ్మలా మారారని రాఘవులు అన్నారు. ట్రంప్ ఆదేశాలకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. మంచి స్నేహ సంబంధాలు ఉన్న ఇరాన్‌తో పరస్పర వ్యాపార ఒప్పందాలను విరమించుకోవాలని.. తాము సూచించిన దగ్గర వ్యాపారం కొనసాగించాలని చెప్పడంతో అమెరికా ఆదేశాలను పాటించి విశ్వ గురువుగా చెప్పుకునే మోడీ విశ్వ బానిసగా మారిపోయారని అభివర్ణించారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయా యన్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని, రాబోయే కాలంలో ఎరువుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్థిక పరిస్థితులు తారుమారు : జూలకంటి
ట్రంప్ విధానాలతో ఆర్థిక పరిస్థితులు తారుమారవుతున్నాయని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టం జరుగుతోందన్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల ప్రభావం నేటికీ ఉందని, దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా హిరోషిమా నాగసాకి పట్టణాలు నిలిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనూ గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువులు దొరక్క.. ధరలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ యుద్ధ విమోచన కోసం ఆలోచన చేయాలని సూచించారు. ఈ సెమినార్‌లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండి.సలీం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హషం, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల, యూగాఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరమళ్ల వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, డీివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాల్లం మహేష్, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి కన్వీనర్ రాములు, టీఆర్‌టీఎఫ్ జిల్లా కార్యదర్శి తరాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
యుద్ధంతో ప్రపంచానికి ముప్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



