– రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో విపరీతమైన ప్రచారం పొందిన ప్రధాని
– ఇప్పుడు తన కుమారుడి ప్రీవెడ్డింగ్ వేడుకలతో ముఖేశ్‌ది అదే దారి
– ప్రపంచ సంపన్నులు బిల్‌గేట్స్, జుకర్‌బర్గ్ సహా దేశ, విదేశీ ప్రముఖులు హాజరు
– ప్రధాన స్రవంతి మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచారం
న్యూఢిల్లీ : భారత్ త్వరలో ఎన్నికల మహాసంగ్రామాన్ని ఎదురు చూడబోతున్నది. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే సర్కారు ఇప్పటికే తన రాజకీయ ప్రచారాన్ని షురూ చేసింది. ఇందుకు అందివచ్చిన ఏ ఒక్క విషయాన్నీ మోడీ సర్కారు వదలటం లేదు. ఈ ఏడాది జనవరిలోనే అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇప్పుడు వివాదాస్పద సీఏఏనూ అమలు చేస్తున్నది. అయితే, ఈ కార్యక్రమాలకు బీజేపీ అనుకూల మీడియాతో పాటు ప్రధాన స్రవంతి మీడియా సైతం విపరీత ప్రచారాన్ని కల్పిస్తున్నది. ఇదే తీరు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ కుమారుడి ప్రీవెడ్డింగ్ వేడుకల్లోనూ కనిపించింది. దేశంలోని సమస్యలపై దృష్టి సారించకుండా.. ఇలాంటి విషయాలపై దృష్టి సారిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తున్న మీడియా తీరుపై సామాజికవేత్తలు, మేధావులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అయోధ్యలో అంతా మోడీనే అన్నట్టుగా..
యూపీలోని అయోధ్య అంశం అనేక ఏండ్లుగా కోర్టులో నానుతూ వచ్చింది. ఎట్టకేలకు 2019, నవంబర్‌లో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే, మోడీ సర్కారు దీనిని కూడా తన ఖాతాలో వేసుకున్నది. ప్రధానిగా తెర వెనక మోడీ కృషి ద్వారానే ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైందని ప్రచారం చేసుకున్నది. బీజేపీ అనుకూల సోషల్ మీడియాతో పాటు బీజేపీ అనుకూల మీడియా సైతం ఆ ప్రచార భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నది.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏడాదే అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులకు ప్రధాని హౌదాలో మోడీ శంకుస్థాపన చేశారు. ఆ ఏడాది దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించినప్పటికీ.. ఆగస్టు 5న ప్రధాని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక లౌకిక, ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉండి.. ఒక మతానికి చెందిన కార్యక్రమంలో మోడీ పాల్గొనటం ఏమిటి? అంటూ అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెలువడ్డాయి.
నాలుగేండ్ల తర్వాత..
ఇక దాదాపు నాలుగేండ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది జనవరి 22న ఆలయంలో ‘ప్రాణప్రతిష్ట’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా చేయించింది. అయితే, ఆలయం పూర్తి కాకుండానే ఇలాంటి క్రతువు చేపట్టటం ఏమిటనీ సాక్షాత్తూ హిందూ వర్గాలకు చెందిన మత పెద్దల నుంచే విమర్శలు వినిపించాయి. పలువురు ఈ కార్యక్రమాన్ని సైతం బహిష్కరించారు. అలాగే, రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్మును ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవటాన్ని కూడా పలువురు సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు విమర్శించారు. కానీ, అవేమీ పట్టించుకోని మోడీ.. ప్రచారమే ప్రధానాస్త్రంగా ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించింది మోడీ సర్కారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలైతే ఆ రోజు (జనవరి 22న) సెలవు దినంగా ప్రకటించాయి. బీజేపీ అనుబంధ హిందూ సంఘాలు, సంస్థలైతే.. అయోధ్య అక్షింతలు అంటూ ఇంటింటికీ పంచిపెట్టాయి. అయోధ్యలోని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖులు, వీవీఐపీలకు అభివాదం చేస్తూ మోడీ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని ప్రచారం కల్పించిన బీజేపీ అనుకూల మీడియా మోడీని ఒక హీరోగా చిత్రీకరించింది.
ఇక బీజేపీ, ఇతర హిందూత్వ సంస్థలు, సంఘాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో మోడీని ఒక అవతారపురుషుడు, కారణ జన్ముడు, దైవ సమానుడంటూ వీడియోలు, ఫోటోలతో నానా హంగామా సృష్టించాయి. మొత్తానికి, ఒక మతానికి చెందిన ప్రభుత్వేతర కార్యక్రమానికి ప్రధాని స్థాయిలో వెళ్లి.. దానిని రాజకీయంగానూ తనకు ప్రచారాస్త్రంగా వాడుకోవటం మోడీకే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
‘బాధ్యత మరిచిన మీడియా’
దేశంలో ఇప్పటికే అనేక సమస్యలు, సవాళ్లు ఉన్నాయనీ, వాటిని చూపెట్టి.. ప్రభుత్వాన్ని ప్రశ్నిం చాల్సిన బాధ్యత గల మీడియా తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించటం లేదని సామాజికవేత్తలు, మేధావులు ఆరోపిస్తున్నారు. దేశ ప్రజలు కూడా ఇలాంటి వార్తలతో ప్రభావితం కాకుండా.. వాస్తవాలను గమనంలో ఉంచుకొని విజ్ఞతతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇలాంటి వార్తలు, ప్రచారాలతో ఏ మాత్రమూ ప్రభావితం కాకుండా మంచి, చెడులను తెలుసుకోగలగాలని వారు చెప్తున్నారు.
అంబానీ కుమారుడి పెండ్లి వేడుకల్లో..
అప్పటి అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో మోడీ దేశ ప్రజల దృష్టిని తన వైపు మరల్చుకున్నట్టే.. అంబానీ కూడా తన చిన్న కుమారుడి పెండ్లి వేడుకలతో దేశ దృష్టిన తన వైపునకు తిప్పుకున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నెల 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ముఖేశ్ అంబాన్ని కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ వంటి అత్యంత సంపన్నులు, అంతర్జాతీయ ప్రముఖులు మొదలుకొని.. దేశంలోని పలువురు వీఐపీలు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం జామ్‌నగర్‌కు దాదాపు 130 విమానాలు వచ్చాయి. కేంద్రం అనుమతితో కొన్ని రోజులు ఇది అంతర్జాతీయ విమానాశ్రయం హౌదానూ పొందింది. ఈ ఈవెంట్‌లో ప్రదర్శననివ్వటానికి వచ్చిన రిహాన్నాకు అక్షరాల రూ.58 కోట్లు చెల్లించినట్టు తెలుస్తున్నది. ఈ వేడుకలకు సంబంధించి బయటకు వచ్చిన ప్రతి ఒక్క చిన్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంబానీకి చెందిన వార్తా ఛానెళ్లతో పాటు ప్రధాన స్రవంతి మీడియా సైతం ఈ కార్యక్రమానికి అధిక ప్రచారాన్ని కల్పించింది.