దారేదీ..?

there-is-no-door– వంతెనలు లేక.. వాగులు దాటలేక..!
– అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణాలు
– అత్యవసరంలో వాగులు దాటుతూ కొట్టుకుపోతున్న జనం
– పట్టించుకోని అధికారులు.. పూర్తి చేయని కాంట్రాక్టర్లు
– వర్షాకాలంలో రోజుల తరబడి నిలిచిపోతున్న రాకపోకలు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
– ఇది సిరికొండ మండల కేంద్రం నుంచి ఇంద్రవెల్లికి వెళ్లే దారిలో చిక్‌మాన్‌వాగుపై నిర్మిస్తున్న వంతెన. రూ.10.46కోట్ల అంచనాతో 2021 ఆగస్టులో ప్రారంభించిన ఈ వంతెన పనులు 2023 ఫిబ్రవరిలో పూర్తికావాల్సి ఉంది. కానీ గడువు దాటినా అసంపూర్తిగానే మిగిలింది. ఎప్పటిలోగా పూర్తవుతుందో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి. ఫలితంగా వర్షాకాలంలో చిక్‌మాన్‌ వాగును దాటలేక ఇరువైపుల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– కెరమెరి మండలం లఖంపూర్‌ వద్ద వాగుపై చేపడుతున్న వంతెన నిర్మాణం ఇది. 2016లో పనులు ప్రారంభించారు. ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో అటువైపు కరంజివాడ, బొరిలాల్‌గూడ, అందుగూడ, కోట, జనక్‌పూర్‌, గోర్యగూడ తదితర గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగును దాటే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలున్నాయి.
– నార్నూర్‌ మండలం ఎంపల్లి వాగుపై వంతెన నిర్మాణం కోసం రూ.57లక్షలు మంజూరయ్యాయి. కానీ అటవీ అనుమతులు రావడం ఆలస్యం కావడంతో బ్రిడ్జితో పాటు రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా గ్రామ సమీపంలోని లంబాడితండా, కొలాంగూడ, గోండ్‌గూడ గ్రామాల ప్రజలు వాగుదాటడానికి అవస్థలు పడుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో సమస్య ఉత్పన్నమవుతున్నా పనులు ప్రారంభం కాకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– గాదిగూడ మండలం ఖడ్కి గ్రామ సమీపంలోని వాగుపై ఉన్న లోలెవల్‌ వంతెన ఇది. ప్రతి ఏటా చిన్నపాటి వర్షానికి కూడా పై నుంచి వచ్చే వరదతో వాగు పొంగి పొర్లుతుంది. ఫలితంగా అటువైపున ఉన్న గాదిగూడ, ఝరి, దాబా, లోకారి తదితర గ్రామాల ప్రజలు నార్నూర్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాలకు రాలేకపోతున్నారు. ఇక్కడ వంతెన నిర్మించాలని జెడ్పీటీసీలు ఇటీవల జెడ్పీ సమావేశంలోనూ ప్రస్తావించారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంటేనే కొండలు, కోనలు.. వాటి మధ్య సెలయేళ్లు..వాగులు, వంకలతో ముడిపడి ఉంటుంది. వీటికి అటు, ఇటు వైపున ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే మధ్యలో ఈ వాగులు అడ్డంకి ఉన్నాయి. వర్షాకాలం వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. కొన్ని గ్రామాల మధ్య లోలెవల్‌ వంతెనలు నిర్మించినా వాటిపై నుంచి వరద ప్రవాహం ఉండటంతో వాహనాలు నిలిచిపోతుంటాయి. ఆయా గ్రామాలకు రాకపోకలు సులువుగా మారేందుకు గత ప్రభుత్వం పలు చోట్ల కల్వర్టులు, వంతెనలు మంజూరు చేసింది. కొన్ని నిర్మాణం పూర్తికాగా.. మరికొన్ని అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఏండ్లు గడుస్తున్నా వంతెనల నిర్మాణాలకు మోక్షం కలగడం లేదు. ఫలితంగా అనేక గ్రామాల ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆందోళన చెందుతుంటారు. గత ప్రభుత్వం పలు చోట్ల బ్రిడ్జిలు మంజూరు చేసినప్పటికీ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం కారణంగా జాప్యం జరుగుతోంది. కాంట్రాక్టర్లకు రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లో ఉండటం కారణంగా నిర్మాణాలు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.
లోలెవల్‌ వంతెనలతో ఇబ్బందులు..!
అనేక చోట్ల ఆయా గ్రామాల మధ్య రాకపోకలు సాగించేందుకు అక్కడక్కడ వాగులపై కల్వర్టులు, లోలెవల్‌ వంతెనలు నిర్మించారు. వర్షాకాలంలో వీటిపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహించడంతో రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో అనేక మంది వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ దారుల గుండా ప్రయాణించడం.. లేదంటే తిరిగి వెనక్కి వచ్చేసి వాగుల ప్రవాహం తగ్గిపోయిన తర్వాత వెళ్లడం వంటివి ఇక్కడ సాధారణమవుతున్నాయి. అధికంగా వరదలు సంభవించిన సమయంలో ఆ తాకిడికి కొట్టుకుపోవడం.. తాత్కాలికంగా మరో దారి ఏర్పాటు చేయడం వంటివి ప్రతి ఏటా నిత్య కృత్యం అయ్యాయి. అత్యవసరంగా ఆస్పత్రికి.. ఇతర అవసరాలకు వెళ్లాల్సిన జనాలు.. మరో దారిలేక వాగులు దాటుతూ కొట్టుకుపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో అనేక చోట్ల వంతెనలు లేకపోవడం కారణంగా ఆయా గ్రామాల్లో ఉన్న గర్బిణీల కోసం ముందస్తుగానే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బర్త్‌ వెయిటింగ్‌ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, వంతెనలు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాలకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. వీరితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాలు, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకొస్తున్నా ఫలితం లేకుండా పోతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం కొత్త ప్రభుత్వమైనా అసంపూర్తిగా ఉన్న వంతెనలతో పాటు కొత్త వాటిని నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జనం కోరుతున్నారు.

Spread the love