కోరం లేదు.. మేం వెళ్లిపోతాం : హరీశ్‌రావు

No quorum.. We will leave: Harish Rao– సభను పక్కదోవ పట్టించొద్దు.. కోరం ఉంది : మంత్రి దుద్దిళ్ల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘సభలో కోరం లేదు..మేం వెళ్లిపోతాం’ అని హరీశ్‌రావు అనగా..సభను పక్కదోవ పట్టించొద్దు. కోరం ఉంది అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. గురువారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటుచేసుకున్నది. సభ ప్రారంభంకాగానే పాలప క్షాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష సభ్యులు యత్నించారు. ‘సెక్రెటరీగారూ..సమయం 10:05 అవుతున్నది. ఇంకా గంట మోగలేదు. ఇదేంటండి. కనీసం సభనైనా టైం ప్రకారం నడపండి’ అని హరీశ్‌రావు అంటుండగానే అసెంబ్లీలో లాంగ్‌బెల్‌ మోగింది. ‘స్పీకర్‌గారూ..ఇదేంటండీ కోరం లేకుండా సభను ఎలా నిర్వహిస్తారు? మేం సభ నుంచి వెళ్లిపోతాం. కోరం ఉండేలా చూడటంలో మంత్రి విఫలమయ్యారు’ అంటూ హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ సభ్యులు సభ నుంచి రెండు నిమిషాల పాటు బయటకు వెళ్లిపోయారు. వాస్తవానికి సభలో ఆ సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు 17 మంది, బీఆర్‌ఎస్‌ సభ్యులు ఏడుగురు మొత్తంగా సభలో 24 మంది ఉన్నారు. ఏమైందో ఏమోగానీ రెండు నిమిషాల తర్వాత బీఆర్‌ఎస్‌ సభ్యులు లోనికి వచ్చారు. బడ్జెట్‌పై చర్చకు అనుమతిస్తూ మైక్‌ను బీఆర్‌ఎస్‌ సీనియర్‌ సభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ..’స్పీకర్‌గారు బెల్‌ను 10:05కి మోగించారు. సభను 10:10కి స్టార్ట్‌ చేస్తున్నారు. అసెంబ్లీ నిర్వహణ సమయంలోనైనా సభ్యులు సమయపాలన పాటించేలా చూడండి. సభలో కోరం ఉండేలా చూసుకోవాలి. బడ్జెట్‌పై చర్చ జరిగేటప్పుడు ఆర్థిక శాఖ మంత్రి సభలో లేకపోతే రిప్లై ఎవరు ఇస్తారు? సమయపాలన లేదు..కోరం లేదు..మంత్రి లేరు..దీనిని బట్టే ప్రభుత్వానికి సమావేశాల నిర్వహణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం అవుతున్నది ‘ అంటూ చురకలు అంటించారు.
మాట్లాడుకోదలుచుకోలేకనే వెళ్లిపోయారు : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
‘సీనియర్‌ సభ్యులైన హరీశ్‌రావు అలా మాట్లాడటం సరిగాదు. కోరం కావాల్సినంత ఉంది. నూటికి నూరు శాతం కోరం ఉంది. 1/10 సభ్యులు సభలో ఉండాలి. మేం 18 మందిమి ఉన్నాం. వారూ ఉన్నారు. బడ్జెట్‌పై వారు మాట్లాడ దల్చుకోలేకనే సభ నుంచి వెళ్లిపోయారు. కావాలని బయటకు పోయారు. ఇది సరిగాదు. రేపు పొద్దుటి నుంచే సభలో మా సభ్యుల్లో కనీసం 40 మందినైనా ఉండేలా చూస్తాం’ అని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ సభ్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడు తూ..’మంత్రి 12 మంది అన్నారు. పది శాతం అంటున్నరు. 14 మందే ఉన్నారు. వారికే క్లారిటీ లేదు. పనికిమాలిన రాజకీయాలు చేయాలనీ, బయటకు పోవాలని మాకేమాత్రం లేదు’ అంటూ చురకలు అంటించారు. వెంటనే శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ…’హరీశ్‌రావుకు అన్నీ తెలుసు. సభను బుల్డోజ్‌ చేయాలని చూస్తున్నారు. ఇది సరిగాదు. కోరం ఉంది. దయచేసి ప్రజల్ని, సభను తప్పుదోవ పట్టించొద్దు’ అని కోరారు.

Spread the love