ఉలుకూ..పలుకూ లేదు

– ప్రధాని మౌనం దేనికి సంకేతం?
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోని పక్షంలో తమ పతకాలను గంగానదిలో విసిరేస్తామని మహిళా మల్లయోధులు హెచ్చరించినా, పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అల్టిమేటం ఇచ్చినా ప్రధాని మోడీ మాత్రం ఉలకడం లేదు…పలకడం లేదు. కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా పెదవి విప్పడం లేదు. ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకూ ఎవరూ వారితో సంప్రదింపులు జరిపిన దాఖలాలు సైతం లేవు. పైగా జంతర్‌మంతర్‌ వద్ద ఇకపై ప్రదర్శనలు జరపవద్దని, వేరే వేదికను చూసుకోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతే వారు బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు రెజ్లర్ల నిరసనపై పోలీసుల జులుంను అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం తీవ్రంగా ఖండించింది.
ప్రజాస్వామ్యం, మహిళా హక్కుల గురించి సుద్దులు చెప్పే ప్రధాని దేశానికి ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మహిళా రెజ్లర్లపై తన పార్టీ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినా, పోలీసులు అమానుషంగా ప్రవర్తించినా కనీసం స్పందించకపోవడం దారుణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మోడీ భయపడిన ప్రతిసారీ పోలీసులను మోహరిస్తారని వారు ఎద్దేవా చేస్తున్నారు. మహిళల భద్రత, గౌరవం గురించి ప్రవచనాలు చెప్పడం మోడీకి కొత్తేమీ కాదు. ఆయితే ఆయన మాటలకు, చేతలకు పొంతనే ఉండదు. గత సంవత్సరం స్వాతంత్య్రదినోత్సవం రోజున ఎర్రకోట నుండి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మహిళలను అవమానించబోమని ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. కానీ అదే రోజు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఓ ఘనకార్యం చేసింది. బిల్కిస్‌ బానో, ఆమె కుటుంబసభ్యులపై అమానుష చర్యలకు పాల్పడిన నేరంపై జీవితఖైదు విధించబడిన 11 మందిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జైలు నుండి విడుదలైన వారిని హీరోలుగా కీర్తిస్తూ ఘనస్వాగతం పలికి, మిఠాయిలు పంచారు. ఇంత దారుణం జరుగుతున్నా ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా కొందరు బీజేపీ నేతలు ఈ చర్యను నిస్సిగ్గుగా సమర్ధించుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. బేటీ బచావ్‌ బేటీ పఢావ్‌ అని నినదించే మోడీ ప్రభుత్వం మహిళలకు ఏ మాత్రం భద్రత, రక్షణ కల్పిస్తున్నదో రెజ్లర్ల ఆందోళన తేటతెల్లం చేస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, మహిళా రెజ్లర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సెలవిచ్చారు. న్యాయం లభించే వరకూ సహనంతో వేచి ఉండాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం పోస్కో చట్టం దుర్వినియోగం అవుతోందని గగ్గోలు పెట్టారు. దానిని సవరించాలని సూచించారు. నేరస్తులకు బెయిల్‌ నిరాకరించే చట్ట నిబంధనను తొలగించాలని ఆయన కోరుతున్నారు. నిందితులకు బెయిల్‌ ఇస్తే లైంగిక వేధింపులకు గురైన బాధితులకు ఏ విధంగా రక్షణ లభిస్తుంది? పైగా నిందితులు దానిని దుర్వినియోగం చేసి పదేపదే నేరాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంటుంది. మోడీ మౌనం, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఠాకూర్‌ చెబుతున్న మాటలు, పోస్కో చట్టాన్ని సవరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని బ్రిజ్‌ భూషణ్‌ చేసిన ప్రకటనను గమనిస్తే మహిళా రెజ్లర్ల ఆందోళన విషయంలో మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అర్థమవుతోంది.
అయితే రెజ్లర్లకు అనూహ్యంగా కొందరు బీజేపీ నేతల నుంచి మద్దతు లభిస్తోంది. రెజ్లర్ల ఆరోపణలను పార్టీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఎంపీ ప్రీతమ్‌ ముండే కోరారు. హర్యానాకు చెందిన బీజేపీ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ మౌనాన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా అయోధ్యలో తనకు మద్దతుగా ఈ నెల ఐదున భారీ ర్యాలీ నిర్వహించాలని బ్రిజ్‌ భూషణ్‌ యోచిస్తుండగా అందుకు అధికారులు అనుమతి నిరాకరించారు.

Spread the love