బాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత

There was intense tension during Babu's visitపుంగనూరు -టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తలపెట్టిన ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ద భేరీ’ యాత్రలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి, టిడిపి శ్రేణులు పరస్పరం దాడులకు దిగాయి. రాళ్లదాడులు, వాహనాలను తగలబెట్టడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామం వద్ద తొలుత ఘర్షణ ప్రారంభమైంది. ఆ గ్రామంలో చంద్రబాబును అడ్డుకోవడానికి వైసిపి కార్యకర్తలు ప్రయత్నిండంతో పాటు కాన్వారుపై రాళ్ల దాడి చేయడంతో ప్రారంభమైన ఉద్రిక్తత చిత్తూరు జిల్లాకూ వ్యాపించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పుంగనూరు వద్ద పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో పాటు, భాష్పవాయువు ప్రయోగించారు. ఈ దాడుల్లో ఒక ఎస్‌ఐతో పాటు రెండు పార్టీలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలైనాయి. ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరని రెండు పార్టీల నాయకులు ఆరోపణలకు దిగారు. శనివారం నాడు చిత్తురు జిల్లా బంద్‌కు వైసిపి పిలుపునిచ్చింది. శుక్రవారం ఉదయం నుండే పుంగనూరులో వైసిపి శ్రేణులు బాబు పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించాయి. ఉదయం 11 గంటలకు నల్ల జెండాలతో ప్రదర్శనలు చేయడంతో పాటు, చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ ప్లకార్డులను వైసిపి కార్యకర్తలు ప్రదర్శించారు. మరోవైపు చంద్రబాబుకు పుంగనూరు పట్టణంలోకి అనుమతి లేదని, బైపాస్‌ రోడ్డుపైన ఆయన చిత్తూరుకు వెళ్లాలని చెబుతూ పోలీసులు బ్యారికేడ్లు అడ్డం పెట్టారు. అప్పటికే అన్నమయ్య జిల్లాలో వైసిపి కార్యకర్తలు చేసిన దాడి విషయం తెలియడంతో టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కృష్ణదేవరాయ సర్కిల్‌ వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. పుంగనూరులోకి అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో, పోలీసులకు, టిడిపి శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది. టిడిపి శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సమయంలో పోలీసులపై రాళ్లదాడి జరిగింది. కొందరు పోలీస్‌ వాహనాలకు నిప్పు పెట్టారు.

Spread the love