ఓట్ల కోసం దేశాన్ని తగల బెెడుతున్నారు

– ప్రధాని మోడీ పార్లమెంట్‌కు రాకుండా…ప్రజలను ఎలా విభజించాలో ఆలోచిస్తారు
– ఆయన్ని పార్లమెంట్‌కు రప్పించడమే అవిశ్వాస లక్ష్యం
– తక్కువ సమయం సభకు హాజరైన ప్రధానిగా మోడీ రికార్డు : అవిశ్వాస తీర్మానంపై చర్చలో సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అవిశ్వాస తీర్మానానికి సీపీఐ(ఎం) తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ ఎంపీ ఎ ఎం ఆరీఫ్‌ తెలిపారు.. ప్రధానిని సభకు రప్పించడం కోసం ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం దేశ పార్లమెంట్‌ చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. ప్రధాని సభకు రావాలని తాము నినాదాలు చేస్తుంటే, ఆయన పార్లమెంట్‌కు రాకుండా,క్యాబిన్‌లో కూర్చొని ప్రజలను ఎలా విభజిం చాలని పదే పదే ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విభజనను ఎలా చాకచక్యంగా వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ఉపయోగించుకోవాలో కూడా 50 మంది బీజేపీ ఎంపీలకు ఆయన సూచిస్తున్నారని విమర్శించారు. ”ప్రధాని పార్లమెంట్‌కు రావడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? పార్లమెంట్‌లో ఎదుటి సభ్యులందరూ మీకు శత్రువులని మీరు అనుకుంటు న్నారు. కానీ మేము కూడా మీలాగే ప్రజలచే ఎన్ను కోబడ్డాం” అని గుర్తు చేశారు.
”ప్రపంచ ప్రఖ్యాత అమెరికా టైమ్‌ మ్యాగజైన్‌ ప్రధాని ముఖచిత్రాన్ని ప్రచురించి, ఆయనను విభజన నాయకుడిగా అభివర్ణించింది. అదేవిధంగా రోమన్‌ సామ్రాజ్యం మండుతున్నప్పుడు తన పియానో వాయించిన నీరో చక్రవర్తిగా మన దేశంలోను, వెలుపల ఉన్న ప్రముఖ మీడియాలన్నీ ప్రధాని మోడీని పోల్చాయి” అని తెలిపారు. పార్లమెంట్‌ చరిత్రలో అతి తక్కువ సమయం సభకు హాజరైన ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారని తమకు తెలుసని, ఈ రికార్డును మరెవరూ బద్దలు కొట్టలేరని తాను భావిస్తున్నానని అన్నారు. మణిపూర్‌లో హింస మొదలైన 79 రోజుల తరువాత మాత్రమే ప్రధాని సభ వెలుపల నోరు విప్పారని, ఇది సిగ్గుచేటని ధ్వజమెత్తారు. టెలిగ్రాఫ్‌ వార్తాపత్రిక ప్రధాని స్పందనను మొసలి కన్నీరుగా చిత్రీకరించిం దని తెలిపారు. మణిపూర్‌ అంశం మీ 56 అంగుళాల ఛాతిలోకి చొచ్చుకుపోవడం చాలా కష్టం కాబట్టి, ఇది మొసలి కన్నీరుగా అభివర్ణించిందని అన్నారు.
మణిపూర్‌ తగలబడుతుంటే మన ప్రధాని ఫ్రాన్స్‌కు వెళ్లి ప్రపంచ శాంతి గురించి ప్రసంగిం చారని,”ఆయన దుర్వాసన వెదజల్లుతూ సుగంధ ద్రవ్యాలు అమ్ముతారు” అని అన్నారు. మణిపూర్‌ దహనమవుతుంటే, ప్రధాని మోడీ విదేశాల్లో ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ఒక రాష్ట్రం (మణిపూర్‌)పై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే, ప్రధాని, హౌంమంత్రి తమ పదవికి రాజీనామా చేయాలన్నారు.
మణిపూర్‌ వివాదం తరువాత మరో మతపర మైన అల్లర్లు హర్యానాకు విస్తరించి ఇంకా కొనసాగు తూనే ఉన్నాయన్నారు. హింసను అరికట్టేందుకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. మణిపూర్‌ మండుతున్నప్పుడు ప్రధాని యూసీసీ అనే మరో అంశంతో ప్రజల్లో చర్చకు ప్రయత్నించారని విమర్శించారు. బాబ్రీ మసీదు తరువాత వారణాసి లో మరో మసీదు (జ్ఞానవాపి) కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. దీని తరువాత కాశీ, మధుర మసీదులకు వెళతారని తమకు తెలుసన్నారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా వస్తాయని, ఓట్ల కోసం ఈ దేశాన్ని తగలబెడతారనడంలో సందేహం లేదని ధ్వజమెత్తారు.
దేశంలోని లౌకిక శక్తులు ఈ విభజన శక్తుల నుంచి దేశాన్ని కాపాడతాయని, బీజేపీ ఈ దేశానికి చేసిన వినాశనం నుంచి దేశాన్ని రక్షించడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. ఇండియా కూటమిని ఓడించేందుకు ఈడీ జీవిత కాల డైరెక్టర్‌గా మిశ్రాను నియమించారని, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి లోక్‌సభలో మీ ఇంటికి ఈడీ వస్తుందని ప్రతిపక్షా లను హెచ్చరిస్తోందని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఈడీ ఇప్పటికే తన ఎంపిక విధిని ప్రారంభించిందని విమర్శించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమను ఓడించేందుకు సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, ఆదాయపు పన్ను, సెంట్రల్‌ విజిలెన్స్‌, కస్టమ్స్‌, కాగ్‌ వంటి తొమ్మిది ఏజెన్సీలను పంపారని, కానీ అక్కడి లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని ఓడించలేకపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా ఇండియా కుటమిని ఓడించేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని, అయితే ఆ పప్పులేవీ ఉడకవని స్పష్టం చేశారు.ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం స్వాతంత్య్ర ఉద్యమా నికి వ్యతిరేకం ఉండటం వల్లే, క్విట్‌ ఇండియా గురించి ప్రధాని మోడీకి తెలియదని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్‌లో జర్నలిస్టులు ప్రవేశించడానికి అనుమతి లేదని, దీనికి కారణం ప్రధాని మోడీకి మీడియా అంటే ద్వేషం, భయం అని పేర్కొన్నారు. ఈ సభలో మెజార్టీతో అవిశ్వాస తీర్మానాన్ని ఓడించ వచ్చని, కానీ దేశంలోని ప్రజల బలంతో బీజేపీ ప్రభుత్వంపై అసలు అవిశ్వాసం పెట్టగలమని తమకు గట్టి నమ్మకం ఉందన్నారు.

Spread the love