– ఐచర్ వాహనం ఢకొీని తండ్రీకొడుకులు మృతి
– పోలీసుల అదపులో డ్రైవర్
నవతెలంగాణ-జన్నారం
బతుకుదెరువు కోసం ఏడేండ్ల కొడుకుతో కలిసి ఊరుకాని ఊరికి వలస వచ్చారు. ఒక్కగానొక్క కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నత చదువు చదివించాలన్న ఆశతో భార్యాభర్తలిద్దరూ సంవత్సర కాలంగా ఓ వ్యక్తి వద్ద పశువుల కాపరిగా ఉంటూ జీవనం సాగించారు. కొంత డబ్బు చేతికి రావడంతో స్వగ్రామానికి వెళ్దామని బయల్దేరారు. బస్టాండ్‌లో బస్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఐచర్ వాహనం వారిపైకి దూసుకురావడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. తల్లికి స్వల్పగాయాలయ్యాయి. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని కలమడుగు బస్టాప్ వద్ద గురువారం జరిగింది.బస్టాప్ వద్ద కొడుకుతో కలిసి భార్యాభర్తలు నిల్చొని ఉండగా అతివేగంగా వచ్చిన ఐచర్ వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢకొీట్టి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘనటలో తండ్రీకొడుకులు జోగు సాయికుమార్(37), జోగు లక్ష్మణ్(7) అక్కడికక్కడే మృతిచెందారు. తల్లి మంజులకు స్వల్ప గాయాలయ్యాయి. ఐచర్ నాగ్‌పూర్ నుంచి కొయంబత్తుర్‌కు దారం లోడ్‌తో జగిత్యాల వైపు వెళ్తోంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడపడంతో మూలమలుపు వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢకొీట్టి బస్టాప్‌లో ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. డ్రైవర్‌తో పాటు క్లినర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతిచెందిన తండ్రీకొడుకులు మెదక్ జిల్లా అనంతారం గ్రామానికి చెందిన వారు. భర్తను.. కొడుకును కోల్పోయిన ఆ తల్లి రోదన మిన్నంటింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.