మూడు ముక్కలాట..!

Three pieces..!– విభిన్న రాజకీయం,విచిత్ర పరిస్థితులు
– రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్‌
– ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌..!
– అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి
– ఇదీ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ప్రస్తుత పరిస్థితి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాజకీయాల్లో ఒక్కోసారి విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అధికారంలో ఒక పార్టీ ఉంటే, మరో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు నియోజక వర్గాల్లో ఉంటుంటారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సత్సంబంధాలు లేకుంటే అభివృద్ధికి ఆటంకమే.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ప్రస్తుతం అలాంటి విచిత్ర పరిస్థితే నెలకొంది. ఇక్కడి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ.. రాష్ట్రంలో అధికారంలో లేదు. అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎంపీ లేరు. ఎంపీగా గెలుపొందిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోనే కాదు, ప్రధాన ప్రతిపక్షంలో కూడా లేదు. ఈ విపత్కర పరిస్థితుల వల్ల అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో విచిత్ర రాజకీయ పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కూన శ్రీశైలంగౌడ్‌, రాంచందర్‌రావు, కాంగ్రెస్‌ నుంచి మైనంపల్లి హనుమంతరావు లాంటి వారు పోటీ పడ్డారు. ఇలాంటి ఉద్దండులను కాదని ఓటర్లు జిల్లాలోని ఐదు స్థానాల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించారు. అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాయి. ఇక్కడ అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల మధ్య సరైన సంబంధాల్లేవు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ తాము ఎమ్మెల్యేలమనీ, ప్రొటోకాల్‌ పాటించకుంటే ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. దీంతో అధికార పార్టీ నేతల మాట వినాలా..? ఎమ్మెల్యేల మాట వినాలా..? అన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ విచిత్ర పరిస్థితి
పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ జిల్లాలో ఇలాంటి విచిత్ర పరిస్థితే ఉంది. మల్కాజిగిరి ఎంపీగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్రంలో కాకుండా, కేంద్రంలో అధికారం ఉంది. మెజారిటీ స్థానాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు రావడంతో ఆ కూటమే అధికారం చేపట్టింది. దీంతో జిల్లా రాజకీయాలు విచిత్రంగా మారాయి. జిల్లా ప్రజలు కూడా తమకు ప్రభుత్వంతో పనులు చేయించుకునేందుకు ఎవరిని కలవాలన్న దానిపై తేల్చుకోలేకపోతున్నారు. కాగా ఎమ్మెల్యే, ఎంపీ ఏ పార్టీకి చెందిన వారైనా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసేవారికి గుర్తింపు లభిస్తుందన్నది జగమెరిగిన సత్యం. ప్రభుత్వ పెద్దలను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించి, అవసరమైన నిధులు మంజూరు చేయించుకు రావాల్సిన బాధ్యత ఎమ్మెల్యే, ఎంపీపై ఉంటుంది.
అందరూ కలిస్తేనే అభివృద్ద్ధి
జిల్లా కేంద్రంగా ఎదిగిన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, జీహెచ్‌ఎంసీలో అక్కడక్కడ రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఎండాకాలంలో తాగునీటి సమస్య, మార్కెట్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీలు, ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేస్తేనే అభివృద్ధ్ది సాధ్యమవుతుంది. ప్రస్తుతం కూన శ్రీశైలం గౌడ్‌, రాంచందర్‌రావు, మైనంపల్లి హనుమంతరావు ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా.. వారికి దాదాపు 50వేల మందికిపైగా ఓట్లు వేశారు. వారి కోసమైనా వీరు అభివృద్ధికి సహకరించాల్సి ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల అభివద్ధితో పాటు విద్యారంగ అభివృద్ధి, ఇతర సమస్యల పరిష్కారం కోసం, పనుల విషయంలో అందరూ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Spread the love