ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతి

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలోని ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు సి.వి ఆనంద్‌, రాజీవ్‌ రతన్‌, జితేంద్రలకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ)లుగా పదోన్నతులిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1991వ బ్యాచ్‌కు చెందిన సి.వి ఆనంద్‌.. నగర పోలీసు కమిషనర్‌గా పని చేస్తుండగా, అదే బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌ రతన్‌ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1992 బ్యాచ్‌కు చెందిన జితేంద్ర రాష్ట్ర హౌం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ముగ్గురు అధికారులు ప్రస్తుతం అదనపు డీజీ స్థాయి హోదాలో ఉన్నారు.ఈ ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతులివ్వటంతో వీరిలో ఒకరిని పోలీసు శాఖ చీఫ్‌, రాష్ట్ర డీజీపీగా నియమించనున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కారణం..ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌.. క్యాడర్‌కు సంబంధించిన వివాదం హైకోర్టు పరిశీలనలో ఉన్నది. ఆయన ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి కావటంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సోమేశ్‌ కుమార్‌ కూడా ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి కావటంతో ఆయనను హైకోర్టు ఆదేశాల మేరకు ఆ సమయంలో ఏపీకి పంపించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అంజనీ కుమార్‌కు సంబంధించి న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంట రాష్ట్ర ఐపీఎస్‌ వర్గాలలో నెలకొన్నది.
ఒకవేళ అంజనీకుమార్‌ ఏపీ రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి ఏర్పడితే.. ప్రస్తుతం డీజీపీలు పదోన్నతులు ఇచ్చిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులలో ఎవరో ఒకరు రాష్ట్ర డీజీపీ అయ్యే అవకాశాలున్నాయని చర్చ సాగుతున్నది. అయితే, 1990 బ్యాచ్‌కు చెంది రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న డాక్టర్‌. రవి గుప్తా పేరు కూడా రాష్ట్ర డీజీపీ రేసులో ఉన్నట్టు తెలుస్తున్నది.

Spread the love