తీన్మార్‌.. విజయం

Tinmar.. success– వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నిక
– సెకండ్‌ ప్రియార్టీ కౌంటింగ్‌తో తేలిన ఫలితం
– నిర్దేశిత ఓట్లు 1,55,095 సాధించి రాకేశ్‌రెడ్డిపై మల్లన్న గెలుపు
– మూడ్రోజుల పాటు కొనసాగిన కౌంటింగ్‌
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ మిర్యాలగూడ
ఉమ్మడి వరంగల్‌-ఖమ్మం- నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్‌ మల్లన్న గెలుపొందారు. ఉప ఎన్నిక ఫలితం శుక్రవారం రాత్రి వెలువడింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజేత వెల్లడి కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ పైచేయి సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి కన్నా ముందుగా కోటా ఓట్లు 1,55,095 ఓట్లు సాధించి విజయం సాధించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ సాగింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా శుక్రవారం ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. ఈ ఎన్నికల బరిలో ఉన్న 52 మందిలో చివరి అభ్యర్థి నుంచి ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. వెయ్యి ఓట్లలోపు ఉన్న అభ్యర్థులకు పోలైన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని ఒక్కొక్కరిని తొలగిస్తూ వచ్చారు. ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు నెగ్గాలన్నా పోలైన 3,36,013 ఓట్లలో 23వేలకు పైగా చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 50శాతం +1 వచ్చిన అభ్యర్థిని విజేతగా నిర్ణయించారు. ఈ మేజిక్‌ ఫిగర్‌ 1,55,095ను తీన్మార్‌ మల్లన్న ముందుగా అందుకోవడంతో ఆయన్ను విజేతగా ప్రకటించారు.
రెండో ప్రాధాన్యతలోనూ మల్లన్నే..
మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్‌ మల్లన్న 1,23,813 ఓట్లు సాధించారు. మేజిక్‌ ఫిగర్‌కు ఆయన 31,282 ఓట్ల దూరంలో ఆగిపోయారు. ఈ నేపథ్యంలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి 1,04,248 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. విజయం సాధించాలంటే నిర్దేశిత లక్ష్యానికి 50,847 ఓట్ల దూరంలో ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి 43,313 తొలి ప్రాధాన్యం ఓట్లు సాధించారు. 1,11,782 ఓట్ల దూరంలో ఆయన ఆగారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,697 తొలి ప్రాధాన్యం ఓట్లు రావడంతో ఈయన కూడా లక్ష్యానికి దూరంగా ఉన్నారు.
ఎలిమినేషన్‌ షురూ..
ఏ అభ్యర్థీ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోకపోవ డంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. 52 మంది అభ్యర్థుల్లో ముందంజలో ఉన్న నలుగురిని ఉంచి మిగిలిన 48 మందిని ఎలిమినేట్‌ చేశారు. అయినా ఏ ఒక్క అభ్యర్థీ లక్ష్యాన్ని అందుకోకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ను తొలగించి, ఆయన ఓట్లను షేర్‌ చేశారు. అశోక్‌ నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మల్లన్న, రాకేశ్‌రెడ్డి దాదాపు సమానంగా పంచుకున్నారు. దాంతో మల్లన్న 1,23,709, రాకేశ్‌రెడ్డి 1,04,846 ఓట్లకు చేరుకున్నారు. గెలుపునకు ఇంకా మల్లన్నకు 31,386, రాకేశ్‌రెడ్డికి 50,249 ఓట్లు అవసరం పడ్డాయి. ఈ క్రమంలో మల్లన్న 18,863 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. అశోక్‌ ఎలిమినేషన్‌ తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లు కాంగ్రెస్‌కు 1489, బీఆర్‌ఎస్‌కు 848, బీజేపీకి 385 చొప్పున లభించాయి.
ఈ క్రమంలో మల్లన్న 19,375 ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లీడ్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని సైతం తొలగించి ఓట్లు షేర్‌ చేశారు. బీజేపీ అభ్యర్థికి పోలైన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యతకు వచ్చేసరికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఎక్కువ మంది వేశారు. ఇలా సుమారు ఆరు వేల ఓట్లు రాకేశ్‌రెడ్డికి మల్లన్నతో పోలిస్తే అధికంగా పోలైనట్టు తెలుస్తోంది.
మల్లన్న గెలుపు లాంఛనమే..
రాత్రి 9.30 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితం అధికారికంగా వెలువడలేదు. అయితే మలన్న గెలుపు దాదాపు ఖాయమేనని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిపై 18వేల మెజార్టీతో మల్లన్న కొనసాగుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుందని మల్లన్న కౌంటింగ్‌ కేంద్రం వెలుపుల మీడియాకు వెల్లడించారు. మూడ్రోజుల పాటు 9 గంటలకు ఓ షిఫ్ట్‌ చొప్పున రోజుకు మూడు షిఫ్ట్‌లుగా సిబ్బంది శ్రమించి ఫలితాన్ని తేల్చారు.

Spread the love