ఓట్లు దండుకోడానికేనా..?

Sampadakiyam ప్రపంచంలో ఎక్కడైనా పౌరసత్వం జన్మత: లభిస్తుంది. ఇది సహజ పౌరసత్వం. ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారికి ఇచ్చేది సహజకృత పౌరసత్వం. కానీ దేశచరిత్రలో తొలిసారిగా భారత పౌరసత్వ అర్హత పరీక్ష మతం ప్రాతిపదికన జరగబోతుంది. ఈ దేశంలో నివసించే వారంతా భారత పౌరులేనని రాజ్యాంగం ప్రవచిస్తుంటే, ఒకమతం వారు మాత్రం వేరు అంటూ ప్రస్తుత పాలకులు విభజన రాజకీయాలతో రాజ్యాంగాన్నే అవమానిస్తున్నారు. రామజన్మభూమి, కాశ్మీర్‌ వంటి అంశాలన్ని ముగిసిపో వడంతో ఈ ఎన్నికల తాజా అస్త్రంగా నాలుగేండ్లుగా కోల్డ్‌ స్టోరేజిలో పెట్టిన పౌరసత్వ చట్ట సవరణ-2019కి ఎన్నికల ముంగిట మోడీ ప్రభుత్వం రూల్స్‌ రూపొందించింది.
లౌకిక భారతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వినాశకర చట్టాన్ని తీసు కువచ్చిందనడంలో ఎలాంటి సందే హం లేదు. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఉపక్రమించే ఈ చట్టం దేశ సమగ్రత, సమైక్యతకు గొడ్డలిపెట్టు. ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న యావ తప్ప ప్రజలకు మేలుచేసే ఏ చట్టాలను ఈ ప్రభుత్వం ఏరోజూ చేసిన పాపాన పోలేదు. వాస్తవానికి ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019లోనే దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ నిరంకశ త్వానికి దాదాపు అనేక మంది బలయ్యారు కూడా. అప్పట్లో తాత్కాలికంగా వెనక్కితగ్గి, మరల ఎన్నికల ముంగిట అందునా రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభానికి ముందు రోజున నోటిఫై చేయడం సంఫ్‌ు పరివార్‌ దుష్ట ఎజెండాకు నిదర్శనం.
రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం, కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలన్నీ పక్కనపెట్టి మతపరమైన సున్నితాంశాలను తెరపైకి తెచ్చి భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్లే ప్రయోజనం పొందాలనేది బీజేపీ కుతంత్రం. 2019లో ఎన్నికల ముందు పుల్వామా, సర్జికల్‌ స్ట్రైక్స్‌, దేశభక్తి లాంటి అంశాలను ముందుకుతెచ్చినట్టే, ఇప్పుడూ సిఎఎ లాంటి అంశాలతో లబ్ధిపొందాలని ఆ పార్టీ చూస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్‌ 11న పార్లమెంట్‌లో ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య అత్యంత అప్రజాస్వామిక రీతిలో ఆమోదింపజేసుకుంది. ఎన్‌డిఎ భాగస్వాములతో పాటు, బీఆర్‌ఎస్‌ ఎంపీలు సైతం ఆనాడు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్‌, అఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుండి మనదేశానికి వలస వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలకు భారత పౌరసత్వం ఇస్తారు. ముస్లింలకు మాత్రం ఇవ్వరు. రాష్ట్రాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారి గుర్తింపు, పేర్ల నమోదు క్రమం నుండి రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేయడం చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించింది. ఇది భారత ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధం.
ఈ చట్టాన్ని మూడు దేశాలకే పరిమితం చేయడం, మతం ఆధారంగా తీసుకురావడం 1955లో తీసుకొచ్చిన సీఏఏ చట్టానికి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది పూర్తి వ్యతిరేకం. రాజ్యాంగంలోని 19వ అధికరణం మత పరమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇత రులకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? శ్రీలంకలో దశాబ్దాలుగా మతపరమైన హింసను ఎదుర్కొంటున్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహా యించారు? ఇది తమిళల పట్ల వివక్షా? ఇప్పుడు ముస్లి ములను కాదన్నవారు రేపు క్రైస్తవులను, ఇతర మైనార్టీలను పొమ్మనరన్న గ్యారంటి ఏంటి? వంటి ప్రశ్నలు కొకోల్లలు.
చట్టం ముందు అందరూ సమానమే అని మన రాజ్యాంగం చెబుతోంది. దానిలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం, మతం, రంగు, జాతి, ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండకూడదు. కాని సీఏఏను తీనుకువస్తున్నదెందుకు? కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చే అధికారం పార్లమెంట్‌కు కూడా లేదని కేశవానంద భారతి కేసు తీర్పులో సుప్రీంకోర్టు ఎప్పుడో స్పష్టం చేసింది. తమ రాజకీయ ప్రభావం విస్తరించుకోవడం తప్ప ఇవేవీ పట్టని మన పాలకులు మతాన్ని అడ్డగోలుగా తమ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. కర్నాటక ఎన్నికల సమయంలో ‘జై భజరంగి’ అంటూ ఓట్లు వేయాలని ప్రధానమంత్రే స్వయంగా పిలుపునిచ్చారు. ‘పాకిస్తాన్‌కు వెళ్లండి.. లేదా కబరిస్థాన్‌కు వెళ్లండి’ అంటూ వీరంగం వేయడం, బుల్డోజర్లతో నివాసాలను కూల్చివేయడం.. ‘కమల’ నాయకత్వంలోని ప్రభుత్వాలకు నిత్యకృత్యంగా మారిపోయాయి. 370 సీట్లు ఇవ్వండి.. రాజ్యాంగాన్నే మార్చేస్తాం.. సెక్యులర్‌ దేశంగా భారత్‌ను ఉంచం అని బీజేపీ ఎంపీ అనంత హెగ్డే అంటున్నారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. సీఏఏను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ప్రకటించగా, మరికొన్ని రాష్ట్రాలు అదే బాట లో నడుస్తున్నాయి. భిన్న మతాలు, ఆచారా లు, సంప్రదాయాలు, సంస్కృతులకు నిలయ మైన మన దేశానికి ఈ చట్టం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మత మారణహోమాన్ని రగిలించే మతోన్మాదశక్తుల ఆట కట్టించేందుకు యావద్భారతం ఐక్యంగా పెను కెరటమై లేవాలి. విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి.

Spread the love