నేడు పాలిసెట్‌ 1.05 లక్షల మంది దరఖాస్తు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ రాతపరీక్ష బుధవారం జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి డాక్టర్‌ సి శ్రీనాథ్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 58,468 మంది అబ్బాయిలు, 47,188 మంది అమ్మా యిలు కలిపి మొత్తం 1,05,656 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేశారని వివరించారు. పాలిసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. అభ్యర్థులు వారి వెంట హెచ్‌బీ బ్లాక్‌ పెన్సిల్‌, ఏరేసర్‌, బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌ తీసుకుని రావాలనీ, హాల్‌టికెట్‌ మీద ఫొటో ముద్రించని వారు ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు.

Spread the love