నేడు కాంగ్రెస్‌ మొదటి జాబితా!

Congress first list today!– 9-11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం
– కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటి
– తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టీ, మంత్రి ఉత్తమ్‌
– తెలంగాణ తో పాటు మరో 9 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై జరిగిన చర్చ
– 10 రాష్ట్రాల నుంచి 60 మంది అభ్యర్థుల ఎంపిక
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రానున్న లోక్‌ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు చేసింది. ఈ జాబితాలో పది రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థులను చోటు కల్పించనుంది. గురువారం అక్బర్‌ రోడ్‌ లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ జనరల్‌ సెక్రెటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌, ముఖ్యనేతలు జైరాం రమేష్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, అధిర్‌ రంజన్‌ చౌదరి, అంబికా సోని, ముకుల్‌ వాస్నిక్‌, టీఎస్‌ సింగ్‌ డియో సహా సీఈసీ సభ్యులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ వర్చువల్‌ మోడల్‌ లో హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్నాటక, కేరళ, ఛత్తీస్‌గడ్‌, హర్యానా, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై వేరు వేరుగా చర్చించారు. ఇండియా కూటమి లో ఇతర పార్టీలతో పొత్తుల నేపథ్యంలో… దాదాపు 10 రాష్ట్రాల నుంచి ఫస్ట్‌ లిస్ట్‌ లో 60 పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిసింది.
9-11 సీట్లకు అభ్యర్థుల ఖరారు…
రాష్ట్రం నుంచి దాదాపు 9-11 స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసినట్లు తెలిసింది. సింగిల్‌ నేమ్స్‌, ఎలాంటి పోటీ, వివాదాలకు తావు లేని స్థానాలు ఇందులో ఉంటాయని మీటింగ్‌ లో పాల్గొన్న ముఖ్య నేతలు తెలిపారు. తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో సీఎం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ మెంబర్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు హాజరయ్యారు. రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు అరగంట పాటు సాగింది. పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యనేతలో భేటి అయిన రాష్ట్ర ఇన్‌చార్జీ దీపా మున్షి, పీసీసీ చీఫ్‌ రేవంత్‌… అందరి అభిప్రాయాలను క్రోడికరించి, వడపోసి అశావాహుల జాబితాను తయారు చేసి హైకమాండ్‌ కు సమర్పించినట్టు తెలిసింది. మొత్తం 14 స్థానాలకు సంబంధించిన ఆశావాహుల వివరాలు ఇందులో ఉన్నట్టు సమాచారం. పలు స్థానాలకు సింగిల్‌ నేమ్స్‌ ఉండగా, అసెంబ్లీ ఎన్నికల టైంలో తమ సీట్లను త్యాగం చేసిన వారికి ఎంపీ ఎన్నికల్లో అవకాశం కల్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే ముఖ్యనేతలు కుటుంబ సభ్యులు పోటీ పడుతోన్న మరో మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పార్టీ అగ్రనాయకత్వానికి వదిలేసినట్లు తెలిసింది. ఈ లిస్ట్‌ ఆధారంగా ఖర్గే నేతృత్వంలోని సీఈసీ సభ్యులు అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఖమ్మం, భువనగిరి, నాగర్‌ కర్నూల్‌ స్థానాలపై పీటముడి
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన ఖమ్మం నియోజక వర్గంలో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కాస్తంత ఇబ్బందికరంగా మారినట్లు నేతలు చెబుతున్నారు. ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం భట్టి సతీమణీ నందిని సీటు ఆశిస్తున్నారు. గత వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా భట్టి పలువురు అగ్రనేతలను కలిసి లాబీయింగ్‌ కూడా చేశారు. అలాగే మంత్రులు పొంగులేటి తన తమ్ముడు ప్రసాద్‌ రెడ్డికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల తన కుమారుడు యుగెంధర్‌ కు ఈ సీటు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. దీంతో ఫస్ట్‌ లిస్ట్‌ లో ఖమ్మం సీటు ప్రకటనకు బ్రేక్‌ పడే అవకాశం ఉంది. అలాగే భువనగిరి నుంచి మంత్రి కోమటి రెడ్డి కుటుంభ సభ్యులు టికెట్‌ ఆశిస్తున్నారు. మరోవైపు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక నాగర్‌ కర్నూల్‌ సీటుకు పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి పోటీ పడుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్‌ ను కూడా రిజైన్‌ చేసేందుకు రెడీ అయ్యారు. ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో పాటు, సీఎం రేవంత్‌ ను కూడా కలిసి కోరారు. హైకమాండ్‌ ఆశిర్వాదం తనకే ఉన్నందున, ఆ సీటు తనకే దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సంపత్‌ ఈ సీటు తనకు కేటాయించాలని పట్టుబడుతున్నారు. అలాగే మరికొన్ని స్థానాల్లో కొత్త పేర్లు ఉండే అవకాశం ఉంది.
మొదటి జాబితాలో రాహుల్‌ పేరు
మొదటి జాబితాలో అగ్రనేత రాహుల్‌ గాంధీ పేరు ఉండనుంది. అయితే రాహుల్‌ గాంధీ ఎక్కడి నుంచి పోటీచేస్తారో జాబితా ద్వారా తెలుపుతామని సీఈసీ మెంబర్‌- ఉత్తమ్‌ మీటింగ్‌ అనంతరం వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా కాంగ్రెస్‌ తొలి లిస్ట్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోటీచేసే అభ్యర్థులపై మాత్రమే చర్చ జరిగిందన్నారు.
సీఈసీ పరిశీలనలో కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా….
1. మహబూబ్‌గర్‌: వంశీచంద్‌ రెడ్డి
2. కరీంనగర్‌ : ప్రవీణ్‌ రెడ్డి
3. నిజామాబాద్‌ : జీవన్‌ రెడ్డి
4. పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ
5. జహీరాబాద్‌ : సురేష్‌ శెట్కార్‌
6. సికింద్రాబాద్‌ : బొంతు రామ్మోహన్‌/ఆయన సతీమణి
7. నల్గొండ : జానారెడ్డి/రఘువీర్‌ రెడ్డి
8. భువనగిరి : చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి/కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు
9. మహబూబాబాద్‌ : బలరాం నాయక్‌
10.వరంగల్‌ : అద్దంకి దయాకర్‌ /సర్వే సత్యనారాయణ
11. చేవెళ్ల : సునీత మహేందర్‌ రెడ్డి
12. హైదరాబాద్‌: ఫిరోజ్‌ ఖాన్‌/ ముస్లిం వర్గానికి చెందిన మహిళ అభ్యర్థి
13. నాగర్‌ కర్నూల్‌ : మల్లు రవి/ సంపత్‌ కుమార్‌
14. ఖమ్మం : నందిని/ ప్రసాద్‌ రెడ్డి/ యుగంధర్‌
15. మెదక్‌ : నీలం మధు/మైనంపల్లి
16. మల్కాజ్‌ గిరి: చంద్ర శేఖర్‌
17.ఆదిలాబాద్‌: పార్టీకి చెందిన సీనియర్‌ నేత పేరు

Spread the love