ఎన్నికల్లో పోటీిపై నేడు తుది నిర్ణయం

On competition in elections Final decision today– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై గురువారం నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాంగ్రెస్‌తో సర్దుబాటు ఉంటుందా? లేదా? అన్నది గురువారం నాటికి స్పష్టత వస్తుందన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పరిశీలకులుగా హాజరయ్యారు.
అనంతరం మీడియాతో తమ్మినేని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన ఎత్తుగడలు, కాంగ్రెస్‌తో ఇప్పటి వరకు జరిగిన చర్చలపై రాష్ట్ర కమిటీలో చర్చించామన్నారు. మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని గుర్తు చేశారు. వైరా ఇవ్వబోమంటూ ఇప్పుడు అంటున్నదని చెప్పారు. గతంలో భద్రాచలం, పాలేరు వీలు కాదంటే వదులుకున్నామని అన్నారు. ఇస్తామన్న వైరా కూడా ఇవ్వబోమంటున్నారని వివరించారు. ఇంతకంటే తాము తగ్గే అవకాశం లేదన్నారు. ఆ రెండు సీట్లు ఇవ్వకుంటే విడిగా పోటీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని మూడురోజుల కింద ప్రకటించానని చెప్పారు. అందుకనుగుణంగా నియోజకవర్గాల వారీగా చర్చించామని అన్నారు. ‘పోటీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవద్దు. సోనియాగాంధీ అనారోగ్యం వల్ల మంగళవారం కాంగ్రెస్‌ సమావేశం జరగలేదు. బుధవారం సాయంత్రం లేదా గురువారం ఉదయంకల్లా సమాచారం ఇస్తాం. పాజిటివ్‌గానే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. మీ నిర్ణయాలు ఇప్పుడే తీసుకోవద్దు’అని కాంగ్రెస్‌ నేతలు తమకు ఫోన్‌ చేశారని చెప్పారు. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాన్ని బుధవారం నిర్వహించారని గుర్తు చేశారు.
అయితే రెండు రోజులు ఆగాలనీ, ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకుందామని వారు కోరారని వివరించారు. ఈ విషయాలపై రాష్ట్రకమిటీలో చర్చించామన్నారు. సీపీఐతో గురువారం ఉదయం చర్చిస్తామని చెప్పారు. ఈలోపు కాంగ్రెస్‌ నిర్ణయం తెలుస్తుందని అన్నారు. మిర్యాలగూడ, వైరా సీట్లు కాంగ్రెస్‌ ఇవ్వకుంటే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించి పోటీ చేసే నియోజకవర్గాలు, అభ్యర్థుల పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

Spread the love