నేడు వరల్డ్‌ లివర్‌ డే

– రెనోవా-ఎన్‌ఐజీఎల్‌ హాస్పిటల్స్‌ డైరక్టర్‌ అండ్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్‌ లివర్‌ ట్రాన్సుప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆర్‌వి.రాఘవేంద్ర రావు నవతెలంగాణ-సిటీబ్యూరో
‘లివర్‌ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాదీ ఏప్రిల్‌ 19వ తేదీన ”వరల్డ్‌ లివర్‌ డే”గా జరుపు కుంటున్నాం. ఈ మేరకు లివర్‌ వ్యాధుల తీవ్రత గురించి అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ”లివర్‌ క్యాన్సర్‌ పరిణామాలు.. చికిత్సా విధానాలు.. అధునాతన వైద్యం” గురించి తెలుసుకుందాం అని రెనోవా – ఎన్‌ఐజీఎల్‌ హాస్పిటల్స్‌కు చెందిన డైరక్టర్‌ అండ్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్‌ లివర్‌ ట్రాన్సుప్లాంట్‌ సర్జన్‌ లిడాక్టర్‌ ఆర్‌వీ. రాఘవేంద్ర రావు వివరించారు. అవేంటో ఆయన మాట ల్లోనే.. జీర్ణ వ్యవస్థలో లివర్‌ ఒక ముఖ్యమైన అవయవం. జీర్ణాశయా నికి కుడివైపున ఇది అమరి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయటంలో కీలకపాత్ర పోషించటంతో పాటు ప్రోటీన్‌ సంశ్లేషణ, మలినాల విసర్జన వంటి అనేక జీవన క్రియల్లో ఉపయోగపడుతుంది. నిరంతరాయంగా పనిచేసే క్రమంలో ఇది వ్యాధి గ్రస్తమవుతుంది. ఇందుకు అనేక కారణాల్ని గుర్తించారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, మద్య పానం, కొన్ని రకాల మందుల వాడకం, క్యాన్సర్‌, పుట్టుకతో వచ్చే లోపాలు వంటివి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అతి ప్రమాదకరం గా పరిగణించబడే క్యాన్సర్‌ వ్యాధి లివర్‌ క్యాన్సర్‌. ఈ క్యాన్సర్‌ నివారణ మరియు చికిత్సలో అనేక ఆధునిక చికిత్సలు అందుబాటు లోకి వస్తున్నాయి.
ఈ చికిత్స విధానంలో ముఖ్యమైనవి
1.లివర్‌ సర్జరీ (హెపటెక్టమీ)
ఈ అత్యున్నత సున్నితమైన శస్త్ర చికిత్స (హెపటెక్టమీ) ద్వారా క్యాన్సర్‌ ఎఫెక్ట్‌ అయిన లివర్‌ భాగాన్ని తొలగిస్తారు. క్యాన్సర్‌ని పూర్తిగా నిర్మూలించడంలో ఈ హెపటెక్టమీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ ఆపరేషన్‌ని లాపరోస్కోపి, రోబోటిక్‌ అసిస్టెడ్‌ విధానాల ద్వారా కూడా చేయడానికి వీలవుతుంది. తద్వారా ఆపరేషన్‌ మెరుగ్గా చేయగలగడమే కాకుండా రోగికి రికవరీకి కూడా ఈ విధానాలు దోహదపడుతాయి.
2. లివర్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌
లివర్‌ క్యాన్సర్‌ బాగా ముదిరిన దశలో ఉన్నప్పుడు లేదా క్యాన్సర్‌తో పాటు లివర్‌ సిర్రోసిస్‌ బాగా ముదిరిన దశలో ఉన్నప్పుడు లివర్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ పద్దతి ద్వారా చెడిపోయిన లివర్‌ని పూర్తిగా తొలగించి కొత్త లివర్‌ ని అమరుస్తారు. ఇందుకు ఆరోగ్యవంతమైన లివర్‌ని బ్రెయిన్‌ డెడ్‌ (కాడెవర్‌ లివర్‌ – డిడిఎల్‌టి) అయిన వ్యక్తి నుంచి లేదా కుటుంబ సభ్యుల నుంచి (లివింగ్‌ డోనార్‌ – ఎల్‌ డి ఎల్‌టి) ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానంలో అనేక సాధక బాధకాల్ని అధిగమించవల సిన అవసరం ఉంటుంది.
3.కీహౌల్‌ ఆపరేషన్స్‌
కొన్ని సందర్భాలలో ఈ క్లిష్టమైన హెపటెక్టమీ ఆపరేషన్స్‌ని తేలికపాటి లాపరోస్కోపి, రోబోటిక్‌ విధానాల ద్వారా చేయడానికి వీలవుతుంది. తద్వారా రోగి రికవరీని సుగమం చేయడమే కాకుండా ఆపరేషన్‌ చేసిన ప్రాంతంలో గాటు గాని మచ్చ గాని లేకుండా ఆపరేషన్‌ పూర్తి చేయడానికి వీలవుతుంది.
4.క్యాన్సర్‌ మందుల వాడకం
ఆధునిక రీసెర్చ్‌ ద్వారా అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానంతో లివర్‌ క్యాన్సర్‌ని కొన్ని మందుల వాడకం ద్వారా నిర్జీవం చేయడానికి వీలవుతుంది. ఇందులో ప్రముఖంగా టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీల ద్వారా శరీరం రోగ నిరోధక శక్తిని వినియోగించుకుంటూ లివర్‌ క్యాన్సర్‌ తీవ్రతని, పురోగతిని అరికట్టడానికి, క్యాన్సర్‌ దశని తగ్గించడానికి వీలవుతుంది.
5.టీం వర్క్‌
లివర్‌ క్యాన్సర్‌ లాంటి ప్రమాదకరమైన రోగాల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అన్ని రంగాలు కలిసి పని చేయడం చాలా ముఖ్యం. ఇందులో ప్రతి రోగిని ఆకాంలజిస్టు, హెపాటాలజిస్ట్‌, సర్జన్‌, ఇతర రంగాల నిపుణులు పరిశీలించి విశ్లేషణ చేయడం ద్వారా రోగి పరిస్థితి, క్యాన్సర్‌ తీవ్రత, క్యాన్సర్‌ దశ లాంటి అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటూ మల్టీ డిసిప్లినరీ విధానాల ద్వారా క్యాన్సర్‌ పై పై చేయి పొందడానికి వీలవుతుంది.
6.సవాలు
ఇంత ఆధునిక పురోగతి జరిగినప్పటికీ కూడా లివర్‌ క్యాన్సర్‌ని తొలి దశలోనే గుర్తించడం అనేది ఇంకా ఒక్క సవాలుగానే ఉన్నది. క్యాన్సర్‌ని కలుగజేసే హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సీ వైరస్‌ల నియంత్రణ కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగాల్సి ఉన్నది. అయితే నిరంతరం పరిశోధ నలు కొనసాగిస్తూ ఆధునిక శస్త్ర చికిత్సలు అవలంబిస్తూ సమాజంలో లివర్‌ క్యాన్సర్‌ పైన దానికి అందుబాటులో ఉన్న చికిత్స విధానాల పైన అవగాహన కల్పిస్తూ మరింత పురోగతి పొందడానికి అవకాశం ఉంది.
7.జాగ్రత్తలు
అనేక రకాల లివర్‌ సమస్యలను క్రమబద్దమైన జీవన సరళి, చక్కటి ఆహారపు అలవాట్లతో నివారించవచ్చు. మద్యపానానికి దూరంగా ఉండటం, హెపటైటిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవటం ద్వారా లివర్‌ వ్యాధులను నివారించుకోవచ్చు.

Spread the love