కంటోన్మెంట్‌లో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు

– రక్షణ శాఖ భూమి రాష్ట్రానికి కేటాయింపు
– కంటోన్మెంట్‌ బోర్డు ఆమోదం
– స్కైవే, హైవేల నిర్మాణాలకు గ్రీన్‌ సిగల్‌
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.. ఇరుకు రోడ్లతో ఇబ్బందికరంగా ఉండే కంటోన్మెంట్‌లో ఇక విశాలమైన రోడ్లు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు కంటోన్మెంట్‌కు సంబంధించిన 33 ఎకరాల భూమిని స్కైవే, హైవేల నిర్మాణాలకు ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు  బోర్డు ఆమోదం తెలిపింది. దాంతో బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో త్వరలో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. కంటోన్మెంట్‌ వెరీడ్‌ బోర్డ్‌ అధ్యక్షుడు సోమశేకర్‌, సీఈఓ మధుకర్‌ నాయక్‌, నామినేటెడ్‌ బోర్డ్‌ మెంబర్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలతోపాటు కంటోన్మెంట్‌ నుంచి 33 ఎకరాల స్థలాన్ని ఇచ్చే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ 44 ప్యారడైజ్‌-సుచిత్ర, ఎన్‌హెచ్‌ 1 జింఖానా గ్రౌండ్‌-హకీంపేట వరకు రోడ్డు విస్తరణకు 33 ఎకరాల కంటోన్మెంట్‌ భూములను ఇచ్చేందుకు తీర్మానం చేసినట్టు తెలిపారు. ఆర్మీ, ప్రయివేటు, బీ2 కలిపి మొత్తం 124 ఎకరాల కేటాయింపు విషయం ఆయా శాఖలు చేస్తాయని వెల్లడించారు.
త్వరలో డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్లు
ఉత్తర తెలంగాణకు ముఖ ద్వారంగా ఉండే కంటోన్మెంట్‌లో రెండు ప్రధాన రహదారులపై డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌లు రానున్నాయి. నగరంలోనే తొలిసారిగా మెట్రో, ఫైఓవర్‌లతో రూపుదిద్దుకోనున్న డబుల్‌ డెక్కర్‌ ఫైఓవర్‌లకు కంటోన్మెంట్‌ వేదిక కానుంది. ప్రతిపాదిత ఫ్లై ఓవర్ల నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు ఆర్మీ అంగీకారం తెలపడంతో ఎనిమిదేండ్ల ప్రతిపాదనలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. రాజీవ్‌ రహదారి రాజసం పెరగనుంది. నాగ్‌పూర్‌ హైవేలో నాగ్‌పూర్‌ మోడల్‌ స్కైవే అందుబాటులోకి రానుంది. ఇక ప్రతిపాదిత రెండు ఫ్లై ఓవర్‌లలో ఒకటి ప్యారడైజ్‌ నుంచి నేరుగా సుచిత్ర వరకు, మరొకటి పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి హకీంపేట వరకు నిర్మించనున్నారు. ఆర్మీ స్థలాల సేకరణ పూర్తయితే ఈ ప్రాజెక్టు శరవేగంగా పట్టాలెక్క నుంది.2015లోనే రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరి యెట్‌, స్కైవేలకు స్థలం ఇవ్వాల్సిందిగా కేంద్ర రక్షణ శాఖను కోరింది. సెక్రటేరియెట్‌ కోసం 60 ఎకరాలు, స్కైవేలకు 90 ఎకరాల ఆర్మీ, కంటోన్మెంట్‌ స్థలాలు ఇచ్చేందుకు 2017లో కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే, ఆర్మీకి ప్రత్యామ్నాయ స్థలంతోపాటు ఎడాదికి రూ.30 కోట్ల చొప్పున సర్వీసు చార్జీ ఇవ్వాలని కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా మంత్రి కేటీఆర్‌ చొరవతో మరోసారి కేంద్రం స్పందించింది. గతంలో అంగీకరించిన 90 ఎకరాలకు అదనంగా మరో 60 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
ఆందోళనలో వ్యాపారులు
కీలకమైన ప్రాజెక్టుల రాకతో కంటోన్మెంట్‌ రూపురేఖలు మారుతాయని స్థానికులు ఆశగా ఎదురు చూస్తుండగా.. వ్యాపారులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 30 నుంచి 60 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న రెండు ప్రధాన రహదారులు 200 అడుగులకు విస్తరించనున్నారు. అంటే రాజీవ్‌ రహదారి, నాగ్‌పూర్‌ హైవేలపై ప్రస్తుతమున్న వ్యాపారాలు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ప్రతిపాదిత స్కైవేల నిర్మాణానికి స్థల సేకరణ చేపడితే కంటోన్మెంట్‌లో 70 శాతం కమర్షియల్‌ నిర్మాణాలు పోతాయి. రాజీవ్‌ రహదారి మార్గంలో సికింద్రాబాద్‌ క్లబ్‌ నుంచి మొదలుకొని, అల్వాల్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు కొన్ని చోట్ల 10 మీటర్ల నుంచి, గరిష్టంగా 30 మీటర్ల వరకు మాత్రమే ఉంది. ఈ రోడ్డును 60 మీటర్లకు విస్తరిస్తే ఇరువైపులా వ్యాపార కేంద్రాలు దాదాపు తొలగించాల్సి వస్తుంది. ప్యారడైజ్‌- బోయిన్‌పల్లి మార్గంలోనూ కొన్ని వ్యాపార కేంద్రాలు రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సి వస్తుంది. దాంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Spread the love