నేపాల్‌లో భూకంపం.. 128 మంది మృతి

నవతెలంగాణ – నేపాల్:  నేపాల్‌లో విషాదం.. భూకంపం సంభవించి వచ్చి 128 మంది మృతి చెందారు. వందల మందిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అక్కడి స్థానిక అధికారులు వివరాలు వెల్లడించారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి కావడంతో పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్‌ తెగిపోయింది. దీంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదు. శుక్రవారం రాత్రి 11 గంటలు దాటాక రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కంపించాయి. 800 కి.మీ దూరంలో ఉన్న దేశ రాజధాని దిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దిల్లీలో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక రోడ్లపై పరుగులు పెట్టారు. దీనికి సంబంధించి పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. దేశ రాజధాని కాఠ్‌మాండూ 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు పలు జిల్లాలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

Spread the love