Thursday, April 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఖైదీల్లో పరివర్తన తీసుకురావాలి

ఖైదీల్లో పరివర్తన తీసుకురావాలి

- Advertisement -

జైలుశాఖలో ఉద్యోగం గురుతర బాధ్యత : డీజీపీ శివధర్‌రెడ్డి
చంచల్‌గూడ సికాలో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి శిక్షణ ప్రారంభం

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
జైలుశాఖలో ఉద్యోగం అనేది కేవలం ఖైదీలను నాలుగు గోడల మధ్య బంధించడం మాత్రమే కాదని, వారిలో పరివర్తన తీసుకువచ్చి తిరిగి సమాజంలో కలిపే గురుతర బాధ్యత అని తెలంగాణ డీజీపీ బి.శివధర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. చంచల్‌గూడలోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సికా)లో బుధవారం ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల ప్రాథమిక ప్రవేశ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. జైళ్ల శాఖ నిర్వహణ అత్యంత సంక్లిష్టమైనదని, శిక్షణార్థులు వృత్తిపరమైన నైపుణ్యం, క్రమశిక్షణతో పాటు మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఖైదీల పట్ల గౌరవభావంతో మెలిగినప్పుడే ఆశించిన సంస్కరణలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలిసో ,తెలియకో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినందువల్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో మార్పు తీసుకువచ్చి సమాజంలో సత్ప్రవర్తనతో జీవించేలా వారిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన పేరిట అడపా దడపా వస్తున్న విమర్శలను జైళ్ళ శాఖలో ఉద్యోగం చేస్తున్నవారు ఎదుర్కొంటుంటారని వివరించారు.
కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ డాక్టర్‌ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ… అంతర్రాష్ట్ర సహకారం ద్వారానే సంస్కరణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని జైళ్ల శాఖ అన్నారు.

ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మన సికాపై నమ్మకంతో ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బందిని శిక్షణకు పంపడం గర్వకారణమని తెలిపారు. గతంలో తిహార్‌ జైలు సిబ్బందికి, బీపీఆర్‌ అండ్‌ డీ ప్రమాణాలతో సికా అందించిన శిక్షణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆమె గుర్తు చేశారు. మొత్తం 381 మంది ఢిల్లీ సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇవ్వనుండగా, మొదటి బ్యాచ్‌లో 62 మంది శిక్షణార్థులు (18 మంది అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లు, 43 మంది మహిళా వార్డర్లు, తెలంగాణ నుంచి ఒకరు) చేరారు. వీరికి క్రిమినాలజీ, సైకాలజీ, మానవ హక్కులు, జైలు పరిపాలనలో సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో శిక్షణకు అవసరమైన కిట్లను ట్రైనీలకు అందజేశారు. జైళ్ళ శాఖ ఐజీ ఎన్‌. మురళీ బాబు, డీఐజీలు డా. డి. శ్రీనివాస్‌, ఎం. సంపత్‌, సికా ప్రిన్సిపల్‌ ఎస్‌. శ్రీనివాసరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

డీజీపీ జన్మదినం కార్యక్రమం
ఈనెల 28న డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ బి .శివధర్‌రెడ్డి 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని శిక్షణ కార్యక్రమం సందర్భంగా జైళ్ల శాఖ అధికారులు కేక్‌ కట్‌ చేశారు. జైళ్ళ శాఖ డీజీ డాక్టర్‌ సౌమ్య మిశ్రా, ఐజీ మురళి బాబు తదితరులు డీజీపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీని శాలువాతో సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -