సామాన్యులను ముందుకు నెట్టి కబ్జాదారుల ఆక్రమణలు
తాత్కాలిక షెడ్లల్లో ఉన్నవారితో నేరుగా మాట్లాడిన హైడ్రా
10 రోజులు గడువిచ్చిన అధికారులు
ఎఫ్‌టీఎల్ పరిధిని పరిరక్షించేందుకు చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘మీరంతా ముష్కిన్ చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో ఉన్నారు. ఇక్కడ తాత్కాలిక షెడ్డుల్లో ఉంటున్నారు. మిమ్ములను పావులుగా వాడుకుని చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూములను కొట్టేయాలని కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలు, మట్టి పోసి చెరువు స్వరూపాన్ని మార్చేసి బడా నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను తెచ్చి చెరువు పరిధిలో వేస్తున్నారు. ఇక్కడే చెత్తను వేరు చేసి వ్యర్థాలను చెరువులోకి వదిలేస్తున్నారు. దీంతో చెరువు కలుషితమౌతోంది. ఇక్కడ తాత్కాలిక షెడ్డులు (నివాసాలు), దుకాణాలను పెట్టించి వారి ఆక్రమణలను తొలగించకుండా అడ్డుగా మిమ్ములను ముందుకు నెట్టుతున్నారు. చెరువు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మీరంతా ఖాళీ చేస్తే చెరువును అభివృద్ధి చేయాలని చూస్తున్నాం. ఆటంకాలు కల్పించొద్దు..” అని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ గ్రామానికి దగ్గరలోని ముష్కిన్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో తాత్కాలిక షెడ్డుల్లో ఉన్న వారికి హైడ్రా అధికారులు బుధవారం సూచించారు. 10 రోజులు సమయం ఇస్తున్నాం.. ప్రత్యామ్నాయం చూసుకుని చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని ఖాళీ చేయాలని చెప్పారు. అక్కడ తాత్కాలిక షెడ్డులు వేసుకుని నివాసముం టున్న వారితో హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, హైడ్రా ఏసీపీ తిరుమల్, ఇరిగేషన్ శాఖ డీఈ రమాదేవితో పాటు పలువురు హైడ్రా అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మాట్లాడారు. పేదలను, అమాయకులను అడ్డం పెట్టుకుని ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని కూడా హెచ్చరించారు. ఎఫ్‌టీఎల్ పరిధిని ఖాళీ చేయాలని 6 నెలలుగా హెచ్చరించినా పట్టని ఆక్రమణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
52.20 ఎకరాల ముష్కిన్ చెరువు
చుట్టూ వేలాది నివాసాలు.. లక్షలాది మంది తిరిగే ప్రాంతంలో ఉన్న ముష్కిన్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి 52.20 ఎకరాలు. చెరువును ఆక్రమించి నిర్మాణ వ్యర్థాలతో నింపేశారు. తాత్కాలిక షెడ్లతో కబ్జా చేయాలనుకునే వారి కుట్రలకు అడ్డుకట్ట వేయాలని హైడ్రా నిర్ణయించింది. అక్కడే చెత్తను వేరుచేసే యూనిట్లకు అద్దెకు ఇచ్చి, ముష్కిన్ చెరువును మురికి కూపంగా మార్చడాన్ని సీరియస్‌గా పరిగణించింది. బడాబాబుల కబ్జాలకు కార్మికులు, సామాన్యులు బలి కావద్దంటూ విజ్ఞప్తి చేసింది. హెచ్‌ఎండీఏ నిర్ధారించిన మేరకు ముష్కిన్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి 52.20 ఎకరాలు ఉంది. ఇందులో పయనీర్స్ సంస్థ 18 ఎకరాల వరకు తమదంటూ వాది స్తోంది. రైతులకు చెందినది 12 ఎకరాల వరకూ ఉంది. వీటికి తోడు మరో 4.20 ఎకరాలు వేర్వేరు వ్యక్తులు క్లైమ్ చేస్తున్నారు. ఇలా మొత్తం 34.20 ఎకరాలు చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనిదే అని హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం తేలింది. శిఖం సర్కారీ ల్యాండ్ 21 ఎకరాల మేర ఉంది. బఫర్‌తో కలిపితే ముష్కిన్ చెరువు 62 ఎకరాల వరకూ ఉంటుందని అధికారులు గుర్తిం చారు. గతంలో బఫర్ జోన్‌లో నిర్మించిన ప్రహరీ ని రెవెన్యూ అధికారు లు కూల్చేశారు. అయినా పట్టించుకోకుం డా.. చెరువులో మట్టిని నింపుతూ ఎఫ్‌టీఎల్ పరిధిలోనే నిర్మాణాలు చేపట్టడానికి బడా నిర్మాణ సంస్థ సిద్ధమౌతోంది. వరద నీరు రాకుండా కాలువలను మూసేసి నిర్మించిన ప్రహరీని స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు.
స్థానికుల హర్షం..
చెరువును కాపాడుతున్న హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. చెరువు కబ్జాలపాలవుతోందని ఫొటోలు, సాక్ష్యాలతో హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, చెరువులో మట్టి నింపుతున్న వీడియోను హైడ్రాకు చూపించామని పలువురు చెప్పారు. వెంటనే హైడ్రా అధికారులు వచ్చి పరిశీలించి చర్యలు తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.



