తెలుగు సాహిత్యం అనువాదం జరగాల్సి వుంది

The Alien Corn‘బాధల బందిఖానాలో శుష్కించిన గుండెలకు.. ఉపశమన చేదను అందించటం.. ఉత్తమ కవిత్వ ఉదాత్తాశయం.. సూర్యబింబాన్ని బొట్టు చేసి.. తూర్పు నుదుటి మీద అతికించేది కవిత్వం.. సుడిగాలికి జడివానకూ జడవని.. మడమతిప్పని కర్తవ్య పరాయణత్వం కవిత్వం…’ అనే ఎలనాగ అనువాద సాహిత్యానికి విశేష సేవలందిస్తున్నారు. ఆంగ్ల సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు, తెలుగు సాహిత్యాన్ని ఆంగ్ల పాఠకులకు అందిస్తున్నారు. ఇటీవల ‘గాలిబ్‌ నాటి కాలం’ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడిమీ పురస్కారనికి సైతం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ముఖాముఖీ…
మీ కుటుంబ నేపథ్యం, మీ రచనా వ్యాసంగం ఎలా మొదలయిందో చెప్తారా..?
కరీంనగర్‌ దగ్గర ఎలగందుల మా స్వగ్రామం. మా నాన్న నాగరాజు తిరుమలయ్య, ఆయుర్వేదం వైద్యులు. అప్పట్లో గ్రామంలో మంచి పేరు ఉండేది. అమ్మ నాగరాజు రంగమ్మ, గృహిణి. నా అసలు పేరు నాగరాజు సురేంద్ర. ఊరు పేరు, ఇంటి పేరు కలిసి వచ్చేలా ఎలనాగా అని నా కలం పేరు పెట్టుకున్నాను. పాఠశాల విద్య మొత్తం స్వగ్రామంలో జరిగింది. మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాను. అయితే రచయిత కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అది సహజంగా అలా జరిగిపోయింది. మా నాన్న అప్పటికప్పుడు కొన్ని పద్యాలు రాసేవారు. చిన్నప్పటి నుండి పత్రికలు, స్కూల్‌ లైబ్రరీలో పుస్తకాలు చదివేవాడిని. స్కూల్లో తెలుగు గురువు ప్రభావం నాపై చాలా ఉండేది. అలాగే మా అన్నయ్య నాగరాజు రామస్వామి సుమారు 15 పుస్తకాలు రాశారు. ఆయన ప్రభావం కూడా నాపై ఉంది. అన్నయ్య కరీంనగర్‌, వరంగల్‌ నుండి సినారే, దాశరథి పుస్తకాలు బాగా తెచ్చేవారు. ఇలా చదువుతున్న క్రమంలోనే కవిత్వం రాయడం మొదలుపెట్టాను. మా తమ్ముడు కూడా సంస్కృతంలో పద్యాలు బాగా రాస్తాడు.
అసలు అనువాదం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది..?
గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి 1972లో 1980 నుండి 1986 వరకు నైజీరియాలో డాక్టర్‌గా పని చేశా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. ఇక అనివార్యంగా ఇంగ్లీష్‌ పుస్తకాలు కొన్ని చదవేవాడిని. అలా సోమర్సెట్‌ మామ్‌తో పాటు ప్రముఖ ఇంగ్లీష్‌ రచయితల పుస్తకాలన్నీ కొని చదివాను. చదవడం అంటే ఏదో ఊసుపోక కాదు. అర్థం తెలియని పదాలకు డిక్షనరీలో వెదికి మరీ అర్థాలు తెలుసుకునేవాడిని. దాంతో ఇంగ్లీష్‌పై మంచి పట్టు సంపాదించగలిగాను. అలా ఇంగ్లీష్‌ పుస్తకాలు చదువుతున్నపుడే మొదటిసారి సోమర్సెట్‌ మామ్‌ రాసినThe Alien Corn అనే ఆంగ్ల నవలిక 1986 కంటే ముందే ‘కలపుమొక్క’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశాను. 2005లో దాన్ని వాహినీ పబ్లికేషన్‌ వారు ప్రింట్‌ వేశారు.
అనువాదం చేసే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
సవాళ్లు కచ్చితంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు సరైన పదం వెదికేందుకు చాలా ప్రయత్నిస్తాను. అనువాదంలో నాకు కేంద్ర సాహిత్య అకాడమీ వారు అవార్డు వచ్చిన గాలిబ్‌ పుస్తకం అనువాదం చేసేటపుడు ఒక పదానికి అర్థం దొరక్క ఆరు నెలలు వెదికాను. ఏదో వేసేద్దాంలే అని అనుకుంటే వాక్యానికి సరైన అర్థం రాదు. ఇలా వెదకడం పెద్ద పని, కష్టం కూడా. కానీ వెదకడం నాకు అలవాటుగా మారిపోయింది. అలాగే మన జాతియాలకు ఇంగ్లీష్‌లో పదాలు దొరకవు. ఉదాహరణకు బతుకమ్మ, బొడ్రాయి వంటివి. ఈ పదాలను ఇంగ్లీష్‌లోకి అనువదించలేం. అలాంటి పదాలను ఇంగ్లీష్‌లోనే పెట్టి కింద ఫుట్‌ నోట్స్‌లో వివరంగా రాస్తాను. అలాగే ‘శవాలని మోసేవాడి కథ’ అనువాదం చేసేటప్పుడు టారో అనే ఓ పదం వచ్చింది. అది పార్శి పదం. ఎంత వెదికినా దాని అసలైన అర్థం దొరకలేదు. దాంతో నాకు తెలిసిన ఇరానీ ఫ్రెండ్‌ ఒకరు అమెరికాలో ఉంటే అతన్ని అడిగాను. ఇలా ఎంతో ప్రయత్నిస్తే చివరకు అది మనం ఒంటికి రాసుకునే సెంట్‌కు సంబంధించిన ఒక బ్రాండ్‌ అని తెలిసింది. ఇలా ఏదైనా ఒక తపస్సులా భావించి చేస్తాను. అలా అనువాదం చేసినప్పుడే సరిగ్గా వస్తుంది. అలా అని అన్ని పదాలకు ఫర్ఫెక్ట్‌గా పెట్టాలనేమి లేదు. ప్రతి వాక్యంలో రెండో మూడో కీలకమైన పదాలు ఉంటాయి. వాటిని సరిగ్గా అనువాదం చేస్తే చాలు. నాకు సందేహాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద పండితులను అడుగుతుంటాను.
ఇతర భాషల్లో ముఖ్యంగా పాశ్యాత్య సాహిత్యంలో తెలుగు సాహిత్యం కంటే భిన్నంగా ఏమైనా ఉందంటారా?
కచ్చితంగా ఉంది. ఉదాహరణ లాటిన్‌ అమెరికా స్టోరీలు కొన్ని అనువాదం చేశాను. శిల్ప పరంగా అద్భుతమైన కథలు అవి. అవి చదువుతుంటే నిజంగానే మనం లాటిన్‌ అమెరికాలో ఉన్నామా అనిపిస్తుంది. అలాంటి వాటి నుండి చాలా నేర్చుకోవచ్చు. ఇలా ఇతర భాషల నుండి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.
మీ పుస్తకాల గురించి చెబుతారా..?
మొత్తం 37 పుస్తకాలు రాశాను. అందులో పదహారు తెలుగులో, రెండు ఇంగ్లీషులో రాశాను. పది ఇంగ్లీష్‌ నుండి తెలుగులోకి, తొమ్మిది తెలుగు నుండి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేశాను. ‘వాగంకురాలు’ అనేది తెలుగులో నా మొదటి కవితా సంపుటి. అలాగే వట్టికోట ఆళ్వార్‌ స్వామి కథలు, కాళోజి కథలు, కాళోజి నా గొడవ, అమ్మంగి వేణుగోపాల్‌ గారి సాహిత్యం ఇంగ్లీష్‌లోకి అనువదించాను. ఈ మధ్యనే డాజలర్స్‌ అని ఇంగ్లీష్‌లో మినీ కవిత్వం రాశాను. వాటిని నేనే తెలుగులోకి అనువదించుకున్నాను. శాస్త్రీయ సంగీతం పట్ల ఉన్న ప్రేమతో ‘మెమొరబుల్‌ మెలోడి మేకర్స్‌ అండ్‌ అదర్‌ పోయమ్స్‌ ఫ్రం మ్యూజిక్‌’ పేరుతో ఓ కవితా సంపుటి రాశాను. ఈ పుస్తకం మన భారతీయ భాషల్లోకి కూడా వచ్చింది. ఆ పబ్లికేషన్‌ వాళ్ళు 15 రోజుల్లోనే బుక్‌ పబ్లిష్‌ చేసి ఇచ్చేశారు. చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళే పొయిట్‌ ఆఫ్‌ ది ఇయర్‌కి అప్లరు చేయమంటే ముందు అంత ఆసక్తి చూపలేదు. తర్వాత చేస్తే అంతర్జాతీయ అవార్డు వచ్చింది. తర్వాత దాన్ని వాళ్ళే ఏడు అంతర్జాతీయ భాషల్లోకి అనువాదం చేశారు.
అనువాదం చేస్తున్న నేటితరానికి మీరిచ్చే సూచనలు..?
ముందు భాషపై పట్టు సాధించాలి. ఒక్క ఇంగ్లీష్‌ అనే కాదు వాళ్లు అనువాదం చేసే ఏ భాషనైనా వంద శాతం మనకు వచ్చి ఉండాలి. కనీసం 90శాతమైన ఆ భాష నేర్చుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన మాతృభాషపైన ఎంత పట్టు ఉంటుందో అనువాదం చేయాలనుకునే భాషపై కూడా అంతే ఉండాలి. అప్పుడే అనువాదానికి న్యాయం చేయగలం. దానికోసం ఒక భూమికను తయారు చేసుకోవాలి. అనువాదానికి భాష చాలా కీలకం. అందుకు చాలా అధ్యయనం చేయాలి.
అసలు కవిత్వ అనువాదం సాధ్యమేనంటారా?
కవిత్వ అనువాదం ఎవరు చేసినా ఓ పది శాతం పోతుంది. వాస్తవానికి అందరూ కవిత్వ అనువాదం కన్నా వచన అనువాదం చాలా సులభం అనుకుంటారు. కానీ అదేంటో నాకు కవిత్వ అనువాదమే సులభంగా ఉంటుంది. బహుశా స్వతహాగా నేను కవిని కావడం వల్లనో ఏమో! వచనానికన్నా కవిత్వాన్ని అనువదించడానికే ఇష్టపడతాను. ఎందుకంటే ఇంగ్లీష్‌ గ్రామర్‌ చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా కచ్చితంగా తప్పులు వస్తాయి. కవిత్వంలో కూడా గ్రామర్‌ సమస్య ఉంటుంది. కానీ వచనంతో పోలిస్తే కాస్త తక్కువే అని చెప్పాలి. కవిత్వంలో లైన్లు తక్కువ. పూర్తి వాక్యం ఉండదు. ఇదే అనువాదానికి అనుకూలం. కానీ వచనం అలా కాదు. చాలా కష్టంగా అనిపిస్తుంది. సరైన పదాలు దొరక్క ఇబ్బంది పడాలి. అనువాదం చేసే క్రమంలో నా సొంత అనుభవాలు ఇవి.
మన తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి పెద్దగా అనువాదం జరగడంలేదు, ఎందుకంటారు..?
ఇతర భాషా సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం కొంత వరకు జరుగుతుంది. కానీ మన తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం అసలే జరగడం లేదు. మన దగ్గర రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒకరిద్దరివి మాత్రమే ఇతర భాషల్లో కనిపిస్తున్నాయి. మన దక్షిణ భారత దేశంలో తెలుగు పరిస్థితి మరీ ఘోరం అనే చెప్పుకోవచ్చు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే విశ్వవిద్యాలయాలు, అకాడమీలు పూనుకొని అనువాదాలు చేయాలి, చేయించాలి.
– సలీమ,
94900 99083

Spread the love