గిరిజన తెగలు ఆగస్టు 9న ప్రపంచ గిరిజన హక్కుల దినంగా జరుపుకోవాలని 1994లో ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఆదివాసి గిరిజన తెగల హక్కులను రక్షించడం, సమాజ పరిణామ క్రమంలో తెగలు నిర్వహించిన పాత్రను గుర్తించడం, పర్యావరణ పరిరక్షణకు వారి మద్దతును కోరడం, స్వయం పాలనాధికారంలో భాగస్వాములుగా చేయడం, ఉమ్మడి సంస్కృతి, జీవన విధానం, భాష ఆచార వ్యవహారాలను గౌరవించడం విద్యా, ఆరోగ్యంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు పాలక ప్రభుత్వాలు కృషి చేయాలని చెబుతూ, గిరిజన తెగలు తమ హక్కులను సాధించుకునేందుకు ఈ దినోత్సవాన గళమెత్తాలని ఐ.రా.స తీర్మానంలో పేర్కొన్నది. భారతదేశంతో పాటు 90 దేశాలు తీర్మానంపై సంతకాలు చేశాయి. గిరిజన తెగల హక్కులను కాపాడుతామని ప్రతిజ్ఞ కూడా చేశాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా బాధ్యత నుండి తప్పుకోవడం బాధాకరం.
2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల మంది ఆదివాసీ గిరిజన తెగల జనాభా ఉన్నది. మనదేశంలో 720 తెగలు 8.6 శాతంతో 10 కోట్ల 43 లక్షల మంది ఉన్నారు. 2021 జనాభా లెక్కలు తీస్తే 15 కోట్లకు చేరే అవకాశం ఉంది. వివిధ దేశాల్లో రకరకాల పేర్లతో గిరిజన తెగలను పిలుస్తున్నారు. వివిధ తెగల సమూహాలన్నిటినీ ఇండిజినెస్ పీపుల్, స్థానిక తెగలుగా ఐక్యరాజ్యసమితి నిర్వచించింది. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ట్రైబ్‌గా గుర్తించారు. వాడుక భాషలో ఆదివాసీలుగా పిలుస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగలుగా అధికారికంగా పిలవబడుతున్నారు. దేశంలో షెడ్యూల్ ప్రాంతాల్లో కొన్ని తెగలు, మైదాన ప్రాంతాల్లో మరికొన్ని తెగలు నివసిస్తున్నాయి.స్వాతంత్య్రానంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్మన్‌గా ఏర్పడిన రాజ్యాంగ కమిటీ గిరిజన తిరుగుబాట్ల స్ఫూర్తితో హక్కులను గుర్తించింది.1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజన తెగలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు, వెసులుబాట్లను కల్పించింది.
పోరాట ఫలితం..అటవీ హక్కుల గుర్తింపు చట్టం
గిరిజన తెగలు అధిక సాంద్రత కలిగిన రాష్ట్రాలలో ఆరవ షెడ్యూల్ ప్రాంతాలుగా, దిగువ సాంద్రత కలిగిన రాష్ట్రాలలో ఐదవ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించింది. ఇక్కడ భూములపై గిరిజన తెగలకు మాత్రమే హక్కులుంటాయి. గిరిజనేతర ప్రజలకు హక్కులను నిషేధించింది. భూ బదలాయింపు నిషేధ చట్టం 1/70 ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల షెడ్యూల్ ప్రాంతాల్లో సైతం అమల్లో ఉన్నది. షెడ్యూల్ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి పేరుతో జరిగే ప్రాజెక్టులు, కాలువలు, పరిశ్రమలు, మైనింగ్ కార్యకలాపాలన్నీ స్థానిక గిరిజన పంచాయతీల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రాంతంలో ప్రభుత్వం కూడా ప్రయివేటు సంస్థగా పరిగణించాల్సి ఉంటుందని బాక్సైట్ తవ్వకాల కేసులో సమతా అనే సంస్థ వేసిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో అడవులున్న అన్ని ప్రాంతాల్లో అటవీ, పోడు భూములపై హక్కులు కల్పించాలని వామపక్ష పార్టీల అండతో సుదీర్ఘకాలం గిరిజనులు పోరాడిన ఫలితంగా చారిత్రాత్మకమైన అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006ను పార్లమెంటు ఆమోదించింది. 2005 డిసెంబర్ 13కు ముందు గిరిజనులు సాగు చేస్తున్న అటవీ, పోడు భూములకు పదెకరాల్లోపు హక్కులు కల్పించాలన్నది. ఈ చట్టం వలనా దేశంలో లక్షలాది గిరిజన కుటుంబాలకు లబ్ధి జరిగింది. ఇంకా లక్షలాది ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించాల్సి ఉంది.
ఎన్నిడూ లేనివిధంగా గిరిజన హక్కులపై దాడి
గిరిజన తెగలకు ఇంతటి ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగ హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నూతన అటవీ సంరక్షణ నియమాల చట్టం-2023ను తీసుకొచ్చింది. దీనివల్ల గిరిజనుల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదమున్నది. అటవీ భూములను వాణిజ్య అవసరాలకు ఎంత భూమినైనా ఇవ్వవచ్చు, అడవుల పెంపకానికి ప్రయివేటు భాగస్వామ్యం కల్పించాలనేది చట్టం ముఖ్య ఉద్దేశం. అటవీ ప్రాంతంలో ఖనిజ సంపదను అంబానీ, ఆదానీ వంటి కార్పోరేట్లకు కట్టబెట్టడం కోసం కనీసం చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా హడావిడిగా పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించుకున్నది. చట్టం అమలుతో గిరిజన ప్రాంతాల్లో జరిగే అటవీ విధ్వంసం వలన కోట్లాది మంది గిరిజనులు అడవుల నుండి బలవంతంగా గెంటివేయబడతారు.దేశంలో మొదటిసారిగా గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసి మరీ గిరిజన హక్కులపై దాడి చేయడం ఆశ్చర్యం. ఆర్టికల్ 332, 335 ప్రకారం గిరిజన తెగలకు రిజర్వేషన్లు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రాల్లో పెరిగిన గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్టికల్ 16 ద్వారా పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. అందులో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నుండి పది శాతానికి రిజర్వేషన్ పెంచుతూ జీవో నెంబర్ 33ను విడుదల చేసింది. న్యాయస్థానాల్లో అడ్డంకులు లేకుండా రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి భద్రత కల్పించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం పెడచెవిన పెట్టింది. ‘రాష్ట్ర ప్రభుత్వం పెంచితే మేము భద్రత కల్పిస్తామని’ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆనాడు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పెంచిన రిజర్వేషన్లపై హైకోర్టులో కేసులు వేస్తూ ఇబ్బందులు కలిగించాలనే కుట్రలు కూడా ప్రారంభమయ్యాయి. గిరిజన తెగల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ఏకంగా 15 ఇతర కులాలను 2022లో గిరిజన జాబితాలో చేర్చింది.
పదేండ్లుగా బడ్జెట్లో కోతలు
కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయింపులు తప్పనిసరిగా చేయాలి. ఈ నిధులు నేరుగా గిరిజనులకు లబ్ధి చేకూర్చే వాటిలోనే ఖర్చు చేయాలని రాజ్యాంగ నిబంధనలున్నాయి. వాటిని పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం గత పదేండ్లుగా లక్షల కోట్లు ఇతర పథకాలకు దారి మళ్లిస్తున్నది. అరకొర కేటాయింపుల్లో సైతం 20 శాతం నిధులు కూడా ఖర్చు చేయడం లేదు.ఆర్టికల్ 275 ద్వారా షెడ్యూల్ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం ప్రతి యేటా బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులను సైతం గత పదేళ్లుగా క్రమక్రమంగా కోత విధిస్తూ వస్తున్నది. ఒకే దేశం-ఒకే చట్టం ఉండాలనే వాదనను కేంద్రం బలంగా వినిపిస్తోంది. పౌరులకు దేశంలో ఎక్కడైనా భూములు కొనుక్కునే హక్కు ఉండాలని చెబుతోంది. ఈ వాదన గిరిజనుల పాలిట శాపం. కేంద్రం 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో రాజ్యాంగం గిరిజనులకు భూమిపై కల్పించిన ప్రత్యేక హక్కులను రద్దు చేస్తుందనే భయాందోళనలు కలుగుతున్నాయి. 1/70 చట్టం, పెసా చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్లు ముందుకొస్తున్నాయి.వీటిని నిజం చేస్తూ తెలుగు రాష్ట్రాల షెడ్యూల్ ప్రాంతంలో గత 25ఏండ్లుగా స్థానిక గిరిజనులకే వందశాతం విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ వచ్చిన జీవో3 పై గిరిజనేతరులు సుప్రీంకోర్టుకు వెళ్లి రద్దు చేయించారు. ఫలితంగా వేలాదిమంది గిరిజనులకు తీవ్రనష్టం జరిగింది.
మణిపూర్‌లో గిరిజన ప్రాంతాలకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 371 (సి) ను ఉల్లంఘిస్తూ గిరిజనేతర మెయితీలకు గిరిజన తెగ హోదా ఇచ్చి షెడ్యూల్ ప్రాంతంలో భూమిపై హక్కులు కల్పించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీనిని వ్యతిరేకించిన అక్కడి గిరిజన తెగలపై మారణకాండ సాగించి వందల మందిని హత్య చేసింది. గిరిజన మహిళలను నగంగా నడి బజార్లో ఊరేగించి సామూహిక హత్యాచారం చేసి హత్య చేసిన ఘటన యావత్ భారతదేశాన్ని ఉలికిపాటు గురిచేసింది. ఇప్పటివరకు దేశ ప్రధాని మణిపూర్‌లో పర్యటించడం లేదంటే గిరిజనుల పట్ల వారికున్న చిత్తశుద్ధి ఏంటనేది అర్థమవుతున్నది. ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాల్సిన ప్రభుత్వం గిరిజన తెగలపైనే విద్వేషాన్ని ప్రచారం చేస్తోంది. ఉగ్రవాదులని, గంజాయి పండిస్తారని, బయటదేశాల నుండి వచ్చిన ఆక్రమణదారులని, దేశద్రోహులని, మతం మారిన వారికి ఇటువంటి శిక్ష జరగాల్సిందేనని తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టింది.
గిరిజన సంస్కృతికి గొడ్డలిపెట్టు ‘యుసిసి’!
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) గిరిజన తెగల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే ప్రమాదం ఉన్నది. గిరిజన తెగల సంస్కృతి, భాష ,ఆచార వ్యవహారాలు ఏతెగకు ఆ తెగ ప్రత్యేకంగా ఉన్నాయి. వివాహ వ్యవస్థ నియమాలు, పండుగలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. యుసిసి అమలు చేయాలంటే షెడ్యూల్ 5,6 లో ఉన్న గిరిజన స్వయం పాలిత మండళ్లు, సలహా మండలి, ఈశాన్య రాష్ట్రాల్లో 371 అధికరణ ప్రకారం అంగీకారం తప్పనిసరి. గిరిజన తెగలు భూమి వనరులు ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తారు. సమిష్టి సాగు, అనుభవించే విధానం నుండి గిరిజన తెగలను ఎలా వేరు చేస్తారు? దేశంలో అనేక గిరిజన తెగలు ఇంకా వేట దశలోనే ఉన్నాయని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి.తెగ సంస్కృతిని క్రమంగా నిర్వీర్యం చేసి హైందవీకరణ చేయాలనే లక్ష్యంతోనే యుసిసి తీసుకొచ్చిందనే ఆరోపణలు దేశంలో అనేక ఆదివాసీ గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఝార్ఖండ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో గిరిజనులు ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. గిరిజన తెగలను ఏ మతంతో సంబంధం లేకుండా ప్రకృతి ఆరాధికులుగా జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలాన్ని పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
(నేడు ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం)
ఆర్.శ్రీరాం నాయక్
9440532410