గిరిజనులకు మినహాయింపు ఇవ్వాలి

– యూసీసీపై పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌ సూచన
– చట్టంపై తొందర ఎందుకన్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై ఎందుకు తొందరపడుతున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్‌, డీఎంకే, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీని వెనుక ఉన్న ఉద్దేశమేమిటని ప్రశ్నించాయి. యుసీసీపై అభిప్రాయాలు సేకరించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (లా అండ్‌ జస్టిస్‌) సోమవారం నాడు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీలు బిల్లును తీసుకురావడంలో తొందరపాటు దేనికని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ప్రస్తుతం యూసీసీ అవసరం లేదని, అది వాంఛనీయం కూడా కాదని 21వ లా కమిషన్‌ తన నివేదికలో అభిప్రాయపడిందని ఆ పార్టీలు తెలిపాయి. కాగా ఈశాన్య ప్రాంతంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ నివసిస్తున్న గిరిజనులను యూసీసీ పరిధి నుండి మినహాయించాలని కమిటీ ఛైర్మన్‌, బీజేపీ ఎంపీ సుశీల్‌ మోడీ సూచించారు. వారికి రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు రక్షణ కల్పిస్తోందని ఆయన గుర్తు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ సభ్యులు ఈ సమావేశానికి రాలేదు. బీఎస్పీ, శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే) పార్టీలు యూసీసీని సమర్ధించాయి.

Spread the love