– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి జ్యోతి
– కాకర్లపల్లిలో ముదిగొండ అమరవీరుల 19వ వర్ధంతి సభ
నవతెలంగాణ-సత్తుపల్లి
ముదిగొండ అమరవీరుల స్ఫూర్తితో మున్ముందు భూ పోరాటాలను మరింతగా ఉధృతంగా తీసుకెళ్తామని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి జ్యోతి పిలుపునిచ్చారు. మంగళవారం సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో ముదిగొండ అమరవీరుల సంస్మరణ సభను పార్టీ సీనియర్ నాయకులు వేపులపాటి కుమారస్వామి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు అమరవీరుల స్థూపానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో జాజిరి జ్యోతి మాట్లాడుతూ… ఆనాడు పేదలకు ఇంటి జాగాలు ఇవ్వాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అత్యంత కర్కషంగా వ్యవహరించి పేద ప్రజలపై కాల్పులు జరిపిందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆ దాస్టికంలో ఏడుగురు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఎవరైనా భూ పంపిణీ విషయంలో పేదలను మోసం చేస్తూ, హక్కుల కోసం పోరాడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆమె విమర్శించారు. ఏడుగురిని పొట్టనబెట్టుకున్నా భూ పోరాట ఎజెండాను పాలకులు తుడిచి పెట్టలేకపోయారన్నారు. పేదలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చే భూమి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ముదిగొండ ఘటన స్ఫూర్తిని నిరూపించిందన్నారు.
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ‘ఇందిరమ్మ ఇళ్లు’ పేరుతో ప్రకటనలకే పరిమితమవుతూ ప్రజలను మోసం చేస్తోందని, ఇళ్ల పంపిణీలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాకర్లపల్లి గ్రామ సమీపంలో నిరుపయోగంగా ఉన్న పాత ఎన్టీఆర్ కాలువను సింగరేణి మట్టితో పూడ్చించి పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేవరకు పోరాడుతామని జ్యోతి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, దాట్ల రాంబాబు, బెజవాడ లక్ష్మీనారాయణ, రామకృష్ణ, వేపులపాటి పుష్పావతి, శైలజ, లక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.



