ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ

Two lakh loan waiver by August 15– వచ్చే పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌తో ప్రతి గింజా కొంటాం
ఇందిరమ్మ కమిటీల ద్వారానే సంక్షేమ పథకాలందజేస్తాం. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం. ముదిరాజులను బీసీ-డీ నుంచి ‘ఏ’లోకి మార్చుతాం. 15 ఎంపీ స్థానాలు గెలిపిస్తే మంత్రివర్గంలో ముదిరాజ్‌ బిడ్డను తీసుకుంటాం. ఎస్సీల వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇస్తాం. బీసీలకు న్యాయం చేసేందుకు కులగణనకు తీర్మానం చేశాం. రెండునెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. కుట్రలతో కూడిన బంగ్లా రాజకీయాలు చెల్లవు. రాష్ట్రంలో ఐదు స్థానాల్లో బీజేపీ గెలుపునకు బీఆర్‌ఎస్‌ ఒప్పందం కుదిరింది. కవిత బెయిల్‌ కోసం కేసీఆర్‌ కుమ్మక్కయ్యారు. మోడీ కాళ్ల వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు. నన్ను దించాలంటున్న వారు మోడీని ఎందుకనడం లేదు..
నవతెలంగాణ- నారాయణపేట నుంచి మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
”ఎన్ని కష్టాలు వచ్చినా ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. సంక్షేమ పథకాల అమలుకు ఇందిరమ్మ కమిటీలు వేస్తాం.. వాటి ద్వారానే ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలందేలా చర్యలు తీసుకుంటాం. రెండు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. తన బిడ్డ కవిత కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల కింద పెట్టారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంది.. భవిష్యత్‌లో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తాం” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో జనజాతర బహిరంగ సభలో పార్లమెంటు ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ.. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ పాలమూరు -రంగారెడ్డి, నారాయణపేట, మక్తల్‌ ఎత్తిపోతల పథకాలను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలోని ముదిరాజ్‌లంతా ఏకతాటిపైకి వచ్చి 15 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్‌లను మంత్రి మండలిలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పదిశాతంగా ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్‌ ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదని, ఈ సామాజిక తరగతికి చెందిన ప్రజలను బీసీ -డీ నుంచి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో పోరాడుతామన్నారు. మాదిగల రిజర్వేషన్‌ పట్ల దోబూచులాడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డిని గెలిపిస్తే సామాజిక తరగతికి చెందిన ప్రజలను బీసీ -డీ నుంచి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో పోరాడుతామన్నారు. మాదిగల రిజర్వేషన్‌ పట్ల దోబూచులాడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డిని గెలిపిస్తే ఏబీసీడీ వర్గీకరణ కోసం న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాదిగల రిజర్వేషన్‌ విషయంలో గతంలో ఉద్యమం చేస్తే ఎత్తుకెళ్లి బయటపడేసిన విషయం మందకృష్ణ మాదిగకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నా కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్నా మోడీ, బీజేపీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే కృష్ణ, వికారాబాద్‌ రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శాసనసభ ఎన్నికలలో గుత్త పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, జమీందారులకు తాము టికెట్లు ఇవ్వలేదని, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్నామని చెప్పారు. పార్టీ పదవులకే కాదు సంక్షేమ పథకాల విషయంలోనూ సామాజిక న్యాయం పాటిస్తామన్నారు. గద్వాల కోట సాక్షిగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బంగ్లా రాజకీయాలు చేసి డీకే అరుణ ఆధ్వర్యంలో మామా అల్లుళ్లు కలిసి బీసీ అభ్యర్థి సరితను ఓడించడానికి కుట్ర చేశారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ముగియగానే గృహజ్యోతి రూ.500కే గ్యాస్‌ అమలు చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సూచనమేరకు నారాయణపేట అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ కోసం చర్యలు తీసుకుంటామన్నారు.
రేవంత్‌రెడ్డిని ఎందుకు పడగొట్టాలని అనుకుంటున్నారు..?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిసారీ రేవంత్‌రెడ్డిని పడగొట్టాలని పిలుపునివ్వడం ఎటువంటి సంకేతాన్నిస్తుందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మూడు నెలల కాలంలోనే ఆరు హామీలను పూర్తి చేసినందుకా.. నియంత పాలన అంతం చేసి సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నందుకా.. ప్రతి పేద కుటుంబానికీ రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పినందుకా.. ఎందుకు రేవంత్‌ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డిని ఊడగొట్టాలని బీజీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అంటున్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా కావాలని ఆమె ఎప్పుడైనా మోడీని అడిగారా?, మక్తల్‌, వికారాబాద్‌ రైల్వేలైన్‌ కావాలని డిమాండ్‌ చేశారా? అని రేవంత్‌ ప్రశ్నించారు. పదేండ్లుగా అధికారంలో ఉన్న మోడీని దించాలని ఎందుకు అనడం లేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రానికి పాలమూరు లాంటి పేద జిల్లా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మీకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. అనతి కాలంలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువతలో భరోసా కల్పించామని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్‌, బీమా, బీసీ గణన వంటివి అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామన్నారు. రాష్ట్రంలో ఐదు స్థానాలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత బీఆర్‌ఎస్‌ తీసుకున్నదని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే కవిత జైలు నుంచి బయటకు వస్తుందన్న భరోసాతో కేసీఆర్‌ ముందుకెళ్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులారా మీ నాయకుడు కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీని ఓడించి తెలంగాణలో 15 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్‌ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సంపత్‌ కుమార్‌, పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, శ్రీహరి, ఎన్నం శ్రీనివాసరెడ్డి, జి మధుసూదన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మధుసూదన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love