దివాళా అంచున ఉక్రెయిన్‌!

Ukraine on the verge of bankruptcy!ఉక్రెయిన్‌ని రష్యాపై యుద్ధానికి ఎగదోసిన అమెరికా తాను అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని స్థిరంగా ఉంచలేకపోతోంది. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న నిధుల సరఫరా అడుగంటిందని, దానితో ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ఉక్రెయిన్‌కు అందిస్తున్న సహాయాన్ని పర్యవేక్షిస్తున్న అమెరికన్‌ ప్రభుత్వ ఏజన్సీ హెచ్చరించింది. ”మాకు ప్రత్యక్ష బడ్జెట్‌ మద్దతు ఇక ఎంతమాత్రం లేదు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో చివరి నిధుల విడుదల కూడా పూర్తయింది. రానున్న నెలల్లో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించటానికిగల ఉక్రెయిన్‌ సామర్థ్యం బలహీనపడటమే కాకుండా యుద్ధాన్ని కొనసాగించగల శక్తిని కూడా ఉక్రెయిన్‌ కోల్పోతుంది.” అని యుఎస్‌ ఎయిడ్‌ అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎరిన్‌ మెకీ సెనేట్‌ విదేశీ సంబంధాల కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చింది.
అమెరికా ప్రభుత్వ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌30వ తేదీనాడు ముగిసింది. ఉక్రెయిన్‌ తన సైనిక, సైనికేతర వ్యయం కోసం అమెరికాపైనే ఆధారపడుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌ దేశాలకు సంయుక్తంగా అత్యవసర సహాయాన్ని అందించటానికి 106 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ప్రతిపాదించాడు. అయితే
ఇంతవరకు అమెరికా కాంగ్రెస్‌ ఉక్రెయిన్‌ కోసం నిర్దేశించిన సహాయాన్ని ఆమోదించలేదు. అమెరికా తక్షణమే ఉక్రెయిన్‌ కు సహాయాన్ని అందించకపోతే ఆ దేశం నగదును ముద్రించటం లేక వేతనాలను చెల్లించకపోవటం వంటి చర్యలకు ఉపక్రమించవలసి ఉంటుంది. అదే జరిగితే ఉక్రెయిన్‌ లో అతి ద్రవ్యోల్బణం వస్తుంది. అది ఆ దేశ యుద్ధ సన్నద్దతను దెబ్బతీస్తుంది. దానితో యుద్ధంలో రష్యా గెలుపు, ఉక్రెయిన్‌ ఓటమి ద్వారా అమెరికా ఓటమి కూడా ఖాయం అవుతుంది.

Spread the love