ఉక్రెయిన్‌ యుద్ధం అమెరికాకు వ్యాపారం : లవ్రోవ్‌

ఉక్రెయిన్‌ యుద్ధం అమెరికాకు వ్యాపారం : లవ్రోవ్‌న్యూయార్క్‌ : ఈ మధ్య కాలంలో అమెరికా ప్రకటనలను చూస్తుంటే ఉక్రెయిన్‌ యుద్ధాన్ని అమెరికా ‘లాభసాటి వ్యాపారం’గా చూస్తున్నట్టు అనిపిస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి తెలిపారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి అంటోనీ బ్లింకెన్‌ చేసిన ప్రకటనలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు కేటాయించిన నిధుల్లో 90శాతం తిరిగి అమెరికా వ్యాపార వర్గాలకు చేరుతోందని, అది అమెరికా రక్షణ పరిశ్రమ పునాదిని పటిష్టపరుస్తుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి అంటోనీ బ్లింకెన్‌ గత నెలలో అన్నాడు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న నిధులను ప్రధానంగా నూతన ఆయుధాల రూపకల్పనకు వాడుతూ, తమ వద్ద నిల్వవున్న ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్నారని 2023 నవంబరులో వాషింగ్టన్‌ పోస్టు రాసింది. అంటే కాలంచెల్లిన ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసి ఆమోదింపబడిన నిధులను నూతన ఆయుధాలను అభివృద్ధికి ప్రయివేటు కంపెనీలకు కేటాయించటం జరుగుతోందని లవ్రోవ్‌ తెలిపారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌లోని సారవంతమైన భూమిని, లిథియంవంటి ఖనిజాలను అమెరికా కైవశం చేసుకుంటోందని తెలిపారు. ఒకవైపు వేలమంది యుద్ధంలో చనిపోతుంటే యుద్ధాన్ని వ్యాపారంగా చూడటం అమెరికాకు మాత్రమే చెల్లుతుందని లవ్రోవ్‌ విచారం వ్యక్తంచేశారు.

Spread the love