Wednesday, July 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓయూలో ‘నిరుద్యోగ ర్యాలీ’

ఓయూలో ‘నిరుద్యోగ ర్యాలీ’

- Advertisement -

జేఏసీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన
ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంగళవారం నిరుద్యోగ జేఏసీ, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ప్రధాన గ్రంథాలయం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.1,000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ ఎల్ మూర్తి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు హామీని నిలబెట్టుకోకపోవడం నిరుద్యోగ యువతను మోసం చేయడమే నన్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పోలీసు శాఖలో 7 వేల పోస్టులు కాకుండా కనీసం 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్), డీఎస్సీతో పాటు అన్ని శాఖల్లోనూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, దానికి అనుగుణంగా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని అన్నారు. పలువురు యువత ఆత్మహత్య చేసుకున్నారని, అందుకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్‌ ‌చేశారు. నిరుద్యోగ భృతి హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు.

డీబీఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ మాట్లాడుతూ.. టీజీపీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌లో ఇప్పటికే 30 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువత నమోదు చేసుకున్నారని, వారికి నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కార్యదర్శి అజయ్ మాట్లాడుతూ.. ఓయూ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని, రాష్ట్ర సాధన ఉద్యమానికి కేంద్ర బిందువైన ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులు ఆరు నెలలు గడిచినా విడుదల చేయకపోవడం బాధాకర మన్నారు. ఓయూతో పాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాల యాల్లోనూ ఖాళీగా ఉన్న అధ్యాపక, బోధనేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే నిర్బంధాలు, అరెస్టులతో అణచివేయడం ప్రజాస్వా మ్యానికి విరుద్ధమని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ లను అమలు చేయాలని, లేకపోతే ఓయూ కేంద్రంగా రాష్ట్రవ్యాప్త విద్యార్థి -నిరుద్యోగ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ర్యాలీ లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కన్వీనర్ డా. వేణు కుమార్, బీఆర్ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ రామటెంకి శ్రీను, రాష్ట్ర నాయకులు కాశీ, ఎస్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత్ మౌర్య, ఎస్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్, నిరుద్యోగ జేఏసీ నాయకులు కృష్ణ, శ్రీనాథ్, సురేష్, నవీన్, మధు, లత, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -