Wednesday, July 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం10న విద్యా సంస్థల బంద్

10న విద్యా సంస్థల బంద్

- Advertisement -

వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు బంద్‌ పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం మీడియా సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌‌యూ, ఏఐడీఎస్‌‌వో, పీడీఎస్‌‌యూ సంఘాల నాయకులు బంద్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలు తోందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇష్టారాజ్యం గా పెంచుతున్న ఫీజులను అరికట్టేందుకు తక్షణమే ‘ఫీజు నియంత్రణ చట్టం’ తీసుకురావాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇది పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలన్నారు.

హైదరాబాద్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, హాస్టళ్లలో సీట్ల సంఖ్య పెంచి, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేయడంతోపాటు, అన్ని పాఠశాలల్లో ఉదయం టిఫిన్ (అల్పాహారం) ఏర్పాటు చేయాలన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో, డీఐఈవో వంటి కీలక పోస్టులను వెంటనే భర్తీ చేసి పాలనను బలోపేతం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యా రంగ పరిరక్షణ కోసం ఈనెల 10న చేపట్టే బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మేధావులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అశోక్ రెడ్డి, లెనిన్ గువేరా, అనిల్, శ్రీను, హరీష్, నాగరాజు, వంశీ, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -