కేంద్ర న్యాయశాఖ మంత్రి నెం.1 అవినీతి పరుడు

Union Law Minister No. 1 corruption– అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ పై బీజేపీ సీనియర్‌నేత కైలాష్‌ మేఘ్వాల్‌ ఆరోపణ
– సస్పెండ్‌ చేసిన బీజేపీ
– కేంద్ర మంత్రి అవినీతిపరుడని విమర్శించడమే నేరం
న్యూఢిల్లీ : రాజస్థాన్‌కు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె విధేయుడు కైలాష్‌ మేఘ్వాల్‌ (89)ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బీజేపీ సస్పెండ్‌ చేసింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ నెంబర్‌ 1 అవినీతిపరుడని ఆరోపిస్తూ ఆయన్ని కేంద్ర క్యాబినెట్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేయడమే కైలాష్‌ చేసిన నేరం. అంతకుముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు కైలాష్‌ సమాధానం ఇవ్వలేదు. అంతేకాక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి అర్జున్‌ రామ్‌ను కేంద్ర క్యాబినెట్‌ నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్‌ చేశారు. కైలాష్‌ గతంలో రాజస్థాన్‌ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. గత నెలలో అర్జున్‌ రామ్‌పై ఆయన తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని చురా జిల్లాలో అధికారిగా పనిచేసినప్పుడు అర్జున్‌ కోట్లాది రూపాయలను ముడుపులుగా పుచ్చుకున్నాడని చెప్పారు.
రాజస్థాన్‌ శాసనసభకు డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కైలాష్‌, అర్జున్‌ మధ్య నెలకొన్న విభేదాలు బీజేపీని కలవరపరుస్తున్నాయి. పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని కైలాష్‌ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెకు సన్నిహితంగా ఉండే నాయకులను లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తనను పార్టీ పట్టించుకోవడం లేదని, పరివర్తన్‌ యాత్రలో పాల్గొనేందుకు అనుమతించడం లేదని విమర్శించారు. అర్జున్‌ వ్యవహారంపై ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశానని, ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కూడా కోరతానని చెప్పారు. రాబోయే శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, బీజేపీ అభ్యర్థిని వేలాది ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని తెలిపారు.

Spread the love