మంత్రి కొండా సురేఖకు
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత ద్వారా తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారులు గజం అంజయ్య కోరారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో కొండా సురేఖను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేనేతకారులు స్వచ్ఛమైన నూలుతో తయారైన శాలువాతో మంత్రిని సత్కరించారు. యాదాద్రి, భద్రాచలం, బాసర, వేములవాడ తదితర ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సేవల్లో పాల్గొనే భక్తులకు అందించే శాలువాలు మరమగ్గాలు, మిల్లుల్లో , కృత్రిమ నూలుతో తయారవుతున్నాయని మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధిస్తున్న పరిస్థితుల్లో సింథటిక్ నూలుతో తయారైన శాలువాల వినియోగాన్ని కొనసాగించడం సముచితం కాదని తన అభిప్రాయం వెలిబుచ్చారు. అందువల్ల రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో చేనేతతో తయారైన పవిత్ర శాలువాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం తగిన విధాన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గజం అంజయ్య చేసిన సూచనలు, ప్రతిపాదనలను మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్వీకరించారు. ఈ దిశగా కృషి చేస్తున్న గజం అంజయ్యను మంత్రి సురేఖ అభినందించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భారతీయ సంప్రదాయాల సంరక్షణలో చేనేత కార్మికులు పోషిస్తున్న పాత్ర కీలమైందని మంత్రి కొనియాడారు. ఆలయాల్లో చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ పరిరక్షణతో పాటు చేనేత కార్మికుల జీవనోపాధికి ఊతం లభిస్తుందని అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి చేనేత రంగానికి మద్దతుగా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
దేవాలయాల్లో చేనేత శాలువాలే ఉపయోగించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



