సార్వత్రిక సమ్మెకు యూఎస్‌పీసీ మద్దతు

– నేడు, రేపు సంఘీభావ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు
– నల్లబ్యాడ్జీలతో విధులకు ఉపాధ్యాయుల హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనీ, రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలనీ, విద్యుత్‌ చట్ట సవరణను రద్దు చేయాలనీ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను, అమ్మకాన్ని నిలిపేయాలనీ, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు, రైతులు, సాధారణ ప్రజలతోపాటు మధ్యతరగతి ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారని బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాల్లేవనీ, ఉద్యోగ భద్రత లేదని తెలిపింది. ఏండ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో కొనసాగిస్తున్నారని పేర్కొంది. గత పదేండ్లలో ఆదాయపన్ను శ్లాబులను సవరించలేదని తెలిపింది. రాయితీ మొత్తాన్ని పెంచలేదని వివరించింది. అన్ని వస్తువులపై జీఎస్టీని వసూలు చేస్తూ వేతన జీవులపై ఆదాయపన్ను భారాన్ని అధికంగా మోపి, కార్పొరేట్లకు మాత్రం పన్నుల్లో రాయితీలను కల్పించిందని విమర్శించింది. రైతులు, కార్మికుల సమస్యలతోపాటు ఆదాయపన్ను శ్లాబులు సవరించాలనీ, రాయితీ పరిమితిని పెంచాలనీ, సీపీఎస్‌, పీఎఫ్‌ఆర్డీఏలను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది.
ఎన్‌ఈపీ-2020ని ఉపసంహరించుకోవాలని కోరింది. సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్‌ బంద్‌కు మద్దతుగా గురువారం సాయంత్రం ఉపాధ్యాయులు జిల్లా కేంద్రాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలనీ, శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై, భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. వీలైన చోట్ల రైతులు, కార్మికులు నిర్వహించే ర్యాలీల్లో పాల్గొనాలనీ, సమ్మె శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలపాలని యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ కోరింది.

Spread the love