ముసురుతో పైర్లకు ప్రాణం..
నవతెలంగాణ – మల్హర్ రావు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు రుతుపవన ద్రోణి కారణంగా శుక్ర, శని, ఆదివారం మూడు రోజులుగా మండలంలో మోస్తరు వర్షం కురిసింది. కొద్దిరోజులుగా వర్షాలు లేకపోగా, మండిపోతున్న ఎండలతో పత్తి, మిర్చి, వరి పంటలు వడబడుతున్నాయి. ఈ నేపథ్యాన శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులుగా కురిసిన వర్షంతో పైర్లకు కొంత మేర ప్రాణం పోసినట్లయింది. ప్రధానంగా పూత, కాత దశలో ఉన్న పత్తికి ఈ వాన ప్రయోజనం కలిగిస్తుంది. పత్తి కాయ విచ్చుకొని పంట వచ్చేందుకు ఈ వాన దోహదపడే అవకాశముంది. అలాగే, ఉద్యాన పంటలు, కూరగాయల పంటలు, మిర్చితో పాటు వరికి కూడా కొంత మేరకు ప్రయోజనం కలిగించింది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉండడంతో భారీ వర్షంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. మండలంలో పత్తి 3600, మిర్చి 2500, వరి 14500 వేల ఎకరాల్లో పంటలు వేశారు. ఇక వర్షంతో వాతావరణం చల్లబడగా ఉక్కపోతతో సతమత మైన జనం ఊపిరి పీల్చుకున్నారు.
పంటలపై కరుణ చూపిన వరుణుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



