‘వాతాపి గణపతిం భజే..’

– డా||ఎం.బాలామణి, 8106713356
దక్కనీ భూమిని పాలించిన బలవంతులైన రాజులు వాకాటకులు. వారే అజంతాలోని కొన్ని ముఖ్యగుహల నిర్మాణానికి కారకులని కూడా మాట్లాడాం. ఎటువంటి బలవంతులైన రాజులైనా ఒకనాడు వారి రాజ్యకాలం అంతమౌతుంది. వాకాటకుల చివరిదశలో రాజ్యంలో అశాంతత పెరిగింది. సామంతుల దండయాత్రలు, ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసి దక్కని రాజ్యాలను భాగాలు చేశారు. కలచూరి రాజులు మహారాష్ట్రను, కదంబ రాజులు కర్నాటకలోని బనవాసిని దక్కించుకుని పాలించారు. కలచూరులు కిందటిసారి మనం మాట్లాడిన ఎలిఫెంటా గుహల నిర్మాణానికి కారణమైనట్టే, కదంబులూ మందిరాల నిర్మాణానికి కారణమయ్యారు. కానీ ఆ నిర్మాణాల లెక్కలేమీ మిగలలేదు. వారిని వెంటనే ద్రవిడ భాష మాట్లాడే అక్కడి వారే చాళుక్యులు, కదంబులపై జయించి తమ రాజ్యం నెలకొల్పారు. వీరిని బదామి చాళుక్యులు, లేదా పశ్చిమ చాళుక్యులుగా పిలుస్తారు. ఒకటవ పులకేసి అనే చాళుక్య రాజు బదామి ప్రాంతంలో కోట కట్టి క్రీ.శ.5213లో రాజ్యం నెలకొల్పాడు. ఆపై ఈ పశ్చిమ చాళుక్యులు 200 సంవత్సరాల పాటు రాజ్యం చేశారు. ఆ సమయంలో వారు భాషా, సంస్కృతి, కళలకు ఇచ్చిన మద్దతు ఉత్తర దక్షిణ భారతీయ పద్ధతులకు వారధి అయింది.
ఈ బదామినే పూర్వకాలంలో వాతాపి అని పిలిచేవారు. ఆనాడు కర్నాటక, తెలుగు ప్రాంతాలు ఒకటిగా కలిసే వుండేవి. ”వాతాపి గణపతింభజే” అని తెలుగువారు పాడే కర్నాటక సంగీతంలోని వాతాపి ఇదేను.
వాతాపిని గురించి తెలుగువారి వంటింటి కథ కూడా ఒకటుంది. వాతాపి అనే ఒక రాక్షసుడికి ఒక వరం ఉందట. చనిపోయినా ఎవరన్నా ‘వాతాపి లేచిరా’ అని పిలిస్తే ప్రాణంతో లేచివస్తాడట. అందుకని రాక్షస బాలురందరూ విద్యార్థుల వేషం వేసుకుని ఈ వాతాపిని మేకగా మార్చి, చంపి రుషి మునులకు భోజనం వండిపెట్టేవారట. వారు ఆ మేకని భుజించాక ‘వాతాపీ బయటకురా’ అని పిలిస్తే ఆ వాతాపి వారి పొట్ట చీల్చుకుని బయటకు రావడం, ఆ మునులు, రుషులు చనిపోవడం జరిగేదట. ఒకనాడు వారి రాక్షస గురువైన శుక్రాచారులవారికి పెట్టారట ఈ భోజనం. వారి మోసం అర్థం చేసుకున్న శుక్రాచార్యుడు, పొట్ట మీద చేయి రాసుకుంటూ ‘జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నాడట. ఆ వాతాపి జీర్ణం అయిపోయాడు, ఏ ఆపదా రాకుండాను. పసిపిల్లలకు పాలు పట్టాక, అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల పొట్టమీద రాస్తూ ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అని అనమంటారు. అలా అయితే పాలు అరిగి బలం పడుతుందని నమ్మకం.
ఈ బదామి చాళుక్యులు హిందూ సంప్రదాయంలో ముందర కొండలు చెక్కించి గుహలలో మందిరాలు, ఆపై స్వతంత్రంగా నిలుచోగల మందిర నిర్మాణాలు చేయించారు. వీరు నిర్మించిన గుహలు బదామిలోనూ, దానికి 25 కి.మీ. దూరంలో ఐహోళేలోనూ కనిపిస్తాయి. ఐహోళేలో రావడఫడి అనే గుహని వీరు మొదటగా క్రీ.శ.550లో నిర్మించారు. ఇది అంతకుముందు గుహ నిర్మాణ పరంపరలతోనే నిర్మించబడింది. రెండు స్తంభాలు గల ద్వారం ఒక సాధారణ వరండాలోకి తెరుచుకుంటుంది. ఆ ద్వారానికి అటూఇటూ ఇద్దరు ద్వారపాలకులు, ఇద్దరు మరగుజ్జులు వారి పక్కగా నిలుచుని వుంటారు. గుహ వరండా వెనుక గదిలో వెనుక వైపు లింగం, ఆ గదికి రెండు వైపులా రెండు గదులు, వెనుక చిన్న గది వుంటాయి. ఈ మధ్య గది ఎత్తు తక్కువగా వుండి మెట్లు కట్టి దిగడానికి వీలుగా వుంటుంది. ఈ మధ్య గది గోడలో శిల్పాలు చెక్కబడి వుంటాయి. ఎడమ పక్క గోడకి నాట్యం చేస్తున్న నటరాజు శివుడి శిల్పం చెక్కబడింది. ఈ బహుబాహు శివుడికి ఎడమపక్క 3, కుడిపక్క 4 సప్త మాతృకలు చెక్కబడి వుంటాయి. బహుశా ఈ నటరాజ శివరూపం, అంధకాసురుడనే రాక్షసుడిని చంపినాక, శివుడు చేసిన నాట్యరూపం కావచ్చు. శివుడికి అంధకాసుర వధలో సాయం చేయడానికి దేవతలు తమ అంశలను పంపారు. అవే సప్త మాతృకలు. ఇక్కడ సప్త మాతృకల శిల్పాలు చూపడం అంటే ఈ నాట్యం ఆ సందర్భంలోనిదని తెలియజేయడమే.
బదామిలో వీరు నిర్మించిన గుహలలో 3వ నంబరు గుహ ఆకర్షణీయమైనది. ఇక్కడ వున్న వరాహశిల్పం పక్కన ఒక శిలాశాసనం చెక్కబడి వున్నది. దాని ప్రకారం పులకేసి కొడుకు మగలేశుడు, ఈ వైష్ణవ గుహని తన సోదరుడైన కీర్తివర్మకి క్రీ.శ. 578లో అంకితమిచ్చాడని, ఈ ఇద్దరు అన్నదమ్ములు ధైర్యవంతులు, విజయులు అని రాసివుంది. భూమిని సముద్రంలో దాగిన రాక్షసుడి నుండి కాపాడిన వరాహ విష్ణురూపాన్ని రాజులకు ఉపమానంగా, వీరులైన రాజులు ఎలా తమ రాజ్యాలను కాపాడారు అనే పోలికతో వివరిస్తారు. ఇదే పోలిక గుప్తులకాలం నాటి ఉదయగిరి గుహలో చంద్రగుప్తుడి గురించి మాట్లాడినప్పుడూ వరాహ శిల్పం చూశాం. ఈ బదామి గుహలో ఈ శిల్పమే కాదు, కొంత పాత సంప్రదాయం పొడిగించింది, ఇక్కడి ద్వారపాలకులు, ఇక్ష్వాకురాజు కట్టించిన 3వ శతాబ్దపు నాగార్జున కొండ చెక్కడాల ద్వారపాలకులతో కూడా పోలిక కనిపిస్తుంది.
అలాగే అజంతా స్తంభాల వంటి అమరిక కూడా కనిపిస్తుంది. స్తంభాలపై మిధున రూపాలు ఎంతో ఆకర్షణీయంగా చెక్కబడ్డాయి. ఈ 3వ గుహ గోడలో లోతు గూళ్ళకు లాగా చెక్కి అందులో పెద్ద పెద్ద విష్ణురూపాలు చెక్కబడ్డాయి. ఈ గుహ వరండాకి ఎడమపక్క శేషసాయి మీద కూర్చుని వున్న అందమైన విష్ణురూపం చెక్కబడింది. 4 చేతులతో, ఒక టోపీలాగ వింతగా వున్న కిరీటంతో రాజఠీవిలో కూర్చుని వుంటాడు ఈ విష్ణువు. ఈ విష్ణురూపానికి పక్క గోడపై వరాహరూపం, భూమిరూపం గుండ్రటి ఆకార శిల్పాలలా అందంగా చెక్కబడ్డాయి. కొసతేలిన ఈ నిలువెత్తు శిల్పాలకు ఆభరణాలూ అందంగా తీర్చబడ్డాయి. చుట్టూ చెక్కిన దేవతా శిల్పాలతో రాచకొలువును గుర్తుకుతెస్తాయి.
ఒకటవ గుహ చిన్నది. ముందుగా చెక్కబడిన శైవగుహ. దీని అమరిక 3వ నంబరు గుహకు లాగానే మండపమూ, స్తంభాల అమరిక కనిపిస్తుంది వరండాకి కుడిపక్క నటరాజరూపం. ఈ నటరాజుకి పక్కన నంది, గణేశుడు, వాద్యగాడు కనిపిస్తారు. ఆ వాద్యగాడి తాళానికి చక్కటి చేతి ముద్రలతో అందంగా నాట్యం చేస్తున్న ఆకర్షణీయమైన నిలువెత్తు శిల్పం ఇది. రావణఫడిలో అంధకాసురవధ తర్వాత చూపిన నృత్యం అంటే కోపంతో చేసిన నృత్యమే అవుతుంది కదా. మొత్తం మీద ఇక్కడి నిర్మాణాలు, శిల్పాలు గడిచిన కాలాల కళలను కలుపుకుంటూ, రాబోయే కాలాల కళలకు నాంది పలుకుతూ కనిపిస్తాయి.
మందిర నిర్మాణాలు – ఈ పశ్చిమ చాళుక్యులు తర్వాతి కాలంలో స్వతంత్రంగా నిలుచున్న మందిర నిర్మాణాలు చేశారు. కనీసం వంద మందిరాలలో కొన్ని జైన మందిరాలు, మిగిలినవన్నీ హిందూ మందిరాలే. రెండవ పులకేశి, కీర్తివర్మ కొడుకు క్రీ.శ.634లో మేగులో ఒక జైన మందిరం కట్టించాడు. ఈ మందిరం ఈ పశ్చిమ చాళుక్యుల గుహ నిర్మాణాలకు, పట్టడకల్‌లో రాబోయే వారి మందిర నిర్మాణాలకు మధ్య వంతెనలా వుంటుంది. మేగుటి గుడిపై చెక్కిన మరగుజ్జు రూపాలు, జంతువుల వరుసలు బదామిని గుర్తు తెస్తాయి.
బదామి నుండే 16 కి.మీ. దూరంలో వున్న పట్టడకల్‌లోని విరూపాక్ష మందిరం ఈ చాళుక్యుల మందిర నిర్మాణాలలో అగ్రస్థాయినందుకుంది. క్రీ.శ 733 – 44 మధ్యలో కట్టిన ఈ మందిరం నిర్మించినది రెండవ వివ్రమాదిత్యుడి పట్టపురాణి లోకమహాదేవి. ఆమె దీనిని శివలోకేశ్వర మూర్తికి అంకితమిచ్చింది. ఇది మేగుటి కంటే పెద్ద మందిరమే కాదు, చక్కని శిల్ప కళతో అందంగా తీర్చిన మందిరం. ఇది కాంచీపురంలోని రాజసింహేశ్వర మందిర నిర్మాణంతో పోలిక చూపవచ్చా లేదా అనే కొన్ని సందేహాలు కళాచరిత్రకారుల వాదనలో వుంది.
విరూపాక్ష మందిరంలో నందీశ్వరుడు కూర్చున్న నందిమండపం విడిగా వుంటుంది. ముఖ్యమందిరం వేరుగా వుండగా, గణేశ, అలాగే దుర్గ గుడి లోపల మహిషాసుర మర్దిని రూపం, అలాగే ఈ గుడి ప్రదక్షిణా పథంలో గోడలోని గూడులో చెక్కిన మహిషాసురమర్దిని రూప భంగిమలో తేడా వుంటుంది. మహీషుడిని చంపుతున్నప్పుడు వేరువేరు భంగిమలను ఊహించి అందులోనుండి రెండు వేరు వేరు భంగిమలను చెక్కి వుంటారు ఇక్కడ. ఈ దుర్గగుడి, తెలుగు ప్రాంతాల్లోని అలంపూర్‌లోని నవబ్రహ్మ మందిరరాలతో పోలిక కనిపిస్తుంది. అవీ ఈ పశ్చిమ చాళుక్యులవే. వాటిలో స్వర్గబ్రహ్మ మందిరం అందమైనది. క్రీ.శ. 682 – 96లో రాణి వినయాదిత్య కొడుకు ఆమె గౌరవార్ధం కట్టించాడు ఈ మందిరం. ఇక్కడ గోడలు, కప్పు, లోపలిభాగంలో అలంకించిన శిల్పాలు కనిపిస్తాయి. బదామికి 5 కి.మీ. దూరంలో మహాకూటలో సంగమేశ్వర మందిరం గురించీ మాట్లాడాలి. ఈ మందిరం సాధారణ అలంకరణతో వున్నా, దక్షిణ గోడలోని గూడులో ఒక మరగుజ్జు రూపం మీద నిలుచున్న లకులీశుడి శిల్పం సమపాదంలో నిలుచుని వుంటుంది. లకులీశుడు పాశుపతశైవం బోధించిన శైవుడు. అంటే ఇది పాశుపతశైవ మందిరమని అర్థం. ఐహోళేలోని లడఖాన్‌ గుడి ఒక గ్రామ పంచాయితీలోని సంఘ కలయిక స్థలంగా కట్టబడింది దీనికి ఈ పేరు ఎలా వచ్చిందనే వివరాలు తెలియవు.
ఈ మొదటి పశ్చిమ చాళుక్యుల మందిరాలు పెద్దపెద్ద రాళ్ళతో, సాధారణ కట్టడాలలా, మధ్య సున్నంపోత లేకుండా రాళ్ళ మటుకే జోడించి కట్టిన కట్టడాలు. చదరంగా కనిపించే పై కప్పుతో ఎత్తు తక్కువ, పొడవుగా ఎన్నో స్తంభాల హాలుతో, శిల్ప అలం కరణతో కనిపిస్తాయి.

Spread the love