– మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
నవతెలంగాణ-నస్పూర్
తెలంగాణ సాయుధ పోరాటంలో అందరికీ ఆదర్శంగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికీ మార్గదర్శకమని, ఆదర్శప్రాయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, రజక సంఘాల నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తి ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ చేరికతో అణగారిన వర్గాల అభ్యున్నతి, భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చిందని, వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి దిశానిర్దేశం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిపిందని, బడుగు బలహీన వర్గాల కోసం, దుక్కి దున్నే వాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములకు, రజాకార్ల అఘాయిత్యాలకు, ఆగడాలకు ఎదురు నిలిచిందని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి సభలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారులు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు తంగల్లపెల్లి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు, ఉపాధ్యక్షుడు ముస్కె చందర్, కమిటీ సభ్యురాలు తడిగొప్పుల భాగ్య, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు సంగెం లక్ష్మణ్, తెలంగాణ రజక సమితి జిల్లా అధ్యక్షుడు తంగళ్ళపెల్లి బాపు పాల్గొన్నారు.