బహుముఖ ప్రజ్ఞాశాలి

బహుముఖ ప్రజ్ఞాశాలిఆయన తెలుగు సాహిత్య రంగంలో శిఖర సమానులు. కవిగా, రచయితగా, పత్రికా సంపాదకునిగా, కథకునిగా, నవలాకారునిగా, సంస్థల నిర్వాహకునిగా, యాత్రా జీవిత చరిత్రల రచయితగా, నాటక రంగ ప్రయోక్తగా, నాటిక కర్తగా కాంగ్రెస్‌ కార్యకర్తగా, ప్రప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల సంధానకర్తగా, అడ్వకేట్‌గా, స్వాతంత్య్ర సమరయోధునిగా, గ్రంధాలయోధ్యమకారునిగా, బహుముఖీయ ప్రజ్ఞాశాలి డా|| పోతుకూచి సాంబశివరావు. తొంభై సంవత్సరాల వయస్సుతో ఆగస్ట్‌ 6వ తేదీ 2017లో కాలం చేశారు. ఎక్కడో గోదావరి జిల్లా ఆలమూరులో 27 జనవరి 1925లో జన్మించి, తన రచనలపై పిహెచ్‌డి చేసే స్థాయికి ఎదిగి, ఆంధ్రా యూనివర్సిటీ నుండి కళా ప్రపూర్ణ బిరుదు, గౌరవ డాక్టరేట్‌ను 1993లో పొందిన గొప్పవ్యక్తి. చుక్కలు ప్రక్రియ నిర్మాత పల్లవాధరరావు రాసిన ఆత్మార్పణ నాటకం మద్రాస్‌ వాణీ మహల్‌లో ప్రదర్శించి గాంధీ గారిచే ప్రసంశ పొందిన డా||పోతుకూచి ‘పల్లెకదిలింది’ నాటకం రాశారు. ఇది సాహిత్య అకాడమీ ఆవార్డ్‌ పొందింది. సంజీవయ్య, పి.వి.నరసింహారావు లాంటి నాటి ముఖ్యమంత్రులతో సన్నిహితంగా మెదిలిన పోతుకూచి… ఉదయకిరణాలు, అన్వేషణ నవలల ద్వారా ప్రశిద్ధులయ్యారు. నవ్యసాహితీసమితి, విజయకళాసమితి, విశ్వసాహితి సంస్థల వ్యవస్థాపకులుగా నిలిచారు.
అఖిలభారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌ (భోపాల్‌) సంస్థకు దక్షిణ భారత కోర్డినేటర్‌గా అభిల భారతస్థాయిలో ఉపాద్యక్షులుగా పనిచేశారు. విశ్వ యూనివిట్‌ ఆంగ్ల పత్రికలు విశ్వ రచన, విశ్వసాహితీ పత్రికలు నిర్వహించారు. ఎందరో యువకుల్ని కవులుగా, రచయిత్రులుగా చేశారు. ‘ఆత్మ కథా తరంగాలు’ అనే ఆయన ఆత్మకథ, సంజీవయ్య జీవిత చరిత్ర బహు ప్రసిద్ధ గ్రంథాలు. ఇండియన్‌ రైటర్స్‌ యూనియన్‌ నుంచి తామ్రపత్రం, సరస్వతీ సమ్మాన్‌ సినారె కళాపీఠం అవార్డ్‌ లాంటి శతాధిక పుస్కారాలొందిన పోతుకూచి నేటి తరం కవులకు, కళాకారులకు, కళా సంస్థల నిర్వాహకులకు నిత్యస్ఫూర్తి ప్రదాత. కేంద్ర సాహిత్య అకాడమీకి తెలుగు సలహా సంఘం సభ్యుడిగా 2 దశాబ్దాలుగా పనిచేశారు. ఆకాశవాణి, దూరదర్శన్‌, నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ లాంటి సంస్థలకు ‘సలహా సంఘం’ సభ్యులుగా పనిచేశారు. ఉస్మానియా సెనేట్‌ మెంబర్‌గా, ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు సభ్యులుగా ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యులుగా చాలాకాలం పనిచేశారు. పోతుకూచి సాహితీ చైతన్య, సాహితీ భీష్మ, భారత్‌ భాషా భూషణ్‌, సరస్వతీ సమ్మాన్‌, కళాప్రపూర్ణ (ఎ.యు) లాంటి ఎన్నో విశిష్ట బిరుదు పురస్కారాలొందారు. 20కి పైగానే యువ రచయితల సభలు ఆయన నిర్వహించారు. 5 వేలకు పైగా సాహితీ సభలు నిర్వహించారు.
– తంగిరాల చక్రవర్తి, 9393804472

Spread the love