గజ్వేల్‌లో ఈటల..కామారెడ్డిలో విజయశాంతి

– బీజేపీ అధిష్టానం ప్లాన్‌ ..?
– కేసీఆర్‌ను ఓడిస్తానంటూ సవాల్‌ చేసిన ఈటల
– ఇంత వరకు గజ్వేల్‌పై కేంద్రీకరించి పని చేసిందిలేదు
– కామారెడ్డిలోనూ అదే పరిస్థితి
– రెండు చోట్లా బీజేపీకి కనీస ఓటు బ్యాంకులేని దుస్థితి
– ఎందుకోసం పోటీ అంటూ చర్చలు
గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం ఘాటుగానే సాగుతోంది. హ్యాట్రిక్‌ విజయం సాధిస్తామని బీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తుండగా.. అధికారం మాదేనంటూ బీజేపీ గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కేసీఆర్‌ పోటీ చేసే నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ధీóటైన అభ్యర్థుల్ని బరిలోకి దించుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌తో కలిసి నడిచిన ఈటల రాజేందర్‌, విజయశాంతిని వచ్చే ఎన్నికల్లో ఆయనపైకి పోటీ పెట్టేలా బీజేపీ పెద్దలు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ను.. కామారెడ్డిలో విజయశాంతిని పోటీ చేయించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరూ గతంలో కేసీఆర్‌తో కలిసి పని చేసిన నాయకులు కావడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే, ఆ రెండు నియోజకవర్గాల్లో బీజేపీకి నామమాత్రం ఓటు బ్యాంకు కూడా లేకపోయినా బలమైన అభ్యర్థులనే భావనతో చేస్తున్న కసరత్తు నిలుస్తుందా..? తుస్‌మంటుందా..? చూడాలి. ఇంతదానికి ఎందుకు పోటీ అన్న చర్చ కూడారాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
వచ్చే ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌.. అందరి కంటే ముందే 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం తొలిసారిగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. రెండు సార్లు గెలిచిన గజ్వేల్‌తో పాటు తొలిసారిగా కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తానని చెప్పారు. అయితే, ఇప్పటికే వచ్చిన లీకేజీలతో జరుగుతున్న ప్రచారం ప్రకారం గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌, కామారెడ్డిలో విజయశాంతిని బరిలో దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరిన ఈటల కేసీఆర్‌ కుటుంబంపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై తాను పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తానని విసిరిన సవాల్‌కు కట్టుబడి ఇక్కడి నుంచే పోటీ చేస్తారా..? లేక ప్రత్యామ్నాయం చూసుకుంటారా వేచి చూడాలి. అదే విధంగా కేసీఆర్‌ పోటీ చేసే రెండో నియోజకవర్గమైన కామారెడ్డిలో బీజేపీ నుంచి విజయశాంతి పోటీ చేస్తారని సమాచారం. ఆమె కూడా కేసీఆర్‌ వెంట పనిచేసి ఎంపీగా కూడా గెలిచారు. ఆ తర్వాత దూరమయ్యారు. వీరిద్దరు కేసీఆర్‌పై పోటీ చేస్తే ఆసక్తిగా మారుతుందనే చర్చ ఉంది. కానీ..! పార్టీల బలాబలాలు, వ్యక్తుల ఇమేజీని పరిశీలిస్తే గజ్వేల్‌ నియోజకవర్గంలో బీజేపీకి పట్టులేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆకుల విజయకు కొద్దిపాటి ఓట్లే వచ్చాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నల్లగాను శ్రీనుకు 1581 ఓట్లే వచ్చాయి.
పోలైన ఓట్లల్లో బీజేపీకి ఒక్క శాతం కూడా రాలేదు. సీఎం కేసీఆర్‌కు 2018లో 125444 ఓట్లు (60.45 శాతం) ఓట్లు వచ్చాయి. కామారెడ్డిలో కూడా గత ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. అక్కడ గంప గోవర్ధన్‌ రెండు సార్లు గులాబీ పార్టీ నుంచి గెలిచారు. దీన్ని బట్టి బీఆర్‌ఎస్‌, బీజేపీకి ఓటు బ్యాంకులో ఎంత తేడా ఉందో అర్థమవుతోంది. పార్టీలకున్న బలం, ప్రజల్లో ఉన్న ఆదరణ కాకుండా కేవలం ఇతర పార్టీలో కీలక నాయకులుగా పనిచేసి వచ్చిన వ్యక్తుల వ్యక్తిగత ఇమేజీపైనే ఆధారపడి కేసీఆర్‌ను ఓడించడం సాధ్యమవుతుందా? అన్నది విశ్లేషకుల ప్రశ్న.
ఉలుకూ పలుకులేని బీజేపీ
మీడియాలో మాటల ఆర్భాటం తప్ప క్షేత్ర స్థాయిలో బీజేపీ ఉలుకూ పలుకు లేదు. రాష్ట్రంలో అధికారం మాదే అంటూ బీరాలు పలికే కమలం పార్టీలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అరువు అభ్యర్థులు తప్ప గట్టి అభ్యర్థులు లేరు. గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన రఘునందన్‌రావు బీజేపీ నుంచి గెలిచినా ఆయన వ్యక్తిగతం తప్ప పార్టీ బలమేమీ పనిచేయలేదని విశ్లేషకులు అంటున్నారు. ఈటల రాజేందర్‌, విజయశాంతి ఇద్దరూ పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల్లో పని చేసిందిలేదు. ప్రజల్ని కలిసింది కూడా లేదు. ఎన్నికల వేళ వచ్చి హడావుడి చేసి కేసీఆర్‌ను ఢ కొట్టడం బీజేపీకి సాధ్యమా..?

Spread the love