నీచంగా ప్రధాని మోడీ మాటలు

నీచంగా ప్రధాని మోడీ మాటలు– ముస్లిముల పేరుతో కాంగ్రెస్‌పై అసత్యపు మాటలు
– కరీంనగర్‌లో ఎంపీగా సంజయ్ అభివృద్ధి శూన్యం
– వెలిచాల అభ్యర్థిత్వంపై కన్ఫ్యుజన్‌ ఏమీ లేదు.. త్వరలోనే అధికారిక ప్రకటన : రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సంపదంతా ముస్లిము లకు పంచిపెడతారని ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు నీచంగా ఉన్నాయని, దేశంలోని అన్ని వర్గాల వారికీ సమాన హక్కులు, సంపద పంచాలన్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యలను వక్రీకరించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 85 శాతం ఉన్న హిందువులకు కాంగ్రెస్‌ పార్టీ ఏనాడైనా అన్యాయం చేసిందా..? వారికి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం తీసుకుందా..? అంటూ ప్రశ్నించారు. ఎప్పుడూ దేశంలో విభజించు పాలించు అన్న సూత్రంతో వైరుధ్యాలు లేవనెతు ్తతున్న బీజేపీ.. ఈ పదేండ్ల కాలంలో చేసిన ఘనకార్యమంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఫక్తు వ్యాపారుల పార్టీ అయిన బీజేపీ పక్కా దళిత, గిరిజన, బలహీనవర్గాల వ్యతిరేకి అని విమర్శించారు. రాముడు అందరివాడని రాజకీయాల్లో వాడుకుంటూ లబ్దిపొందే అవకాశవాదమే తప్ప ఏనాడూ ప్రజలకు ఏం చేశారో.. ఏం చేయబోతున్నారో చెప్పలేని ఆ పార్టీని ఈసారి ప్రజలెవరూ నమ్మబోరని అన్నారు.తొలిదశ ఎన్నికల పోలింగ్‌ తరువాత మోడీ వెన్నులో వణుకు మొదలైందని, అందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముస్లిములకు ఆస్తులు పంచుతుందని నీచంగా మాట్లాడటం మొదలుపెట్టారని విమర్శించారు. పదేండ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో మోడీ ఫొ టోతో ఓట్లు రాలవని భావించి ఇప్పుడు రాముడి చిత్రంతో రంగంలోకి దిగారని ఎద్దేవా చేశారు. ‘కరీంనగర్‌లో ఎంపీగా ఉన్న సంజయ్ కి చదువురాదు.. భాష రాదు.. ఎదుటి వారిని గౌరవించడమూ తెలీదు’ అంటూ విమర్శిం చారు. ‘ఎంపీగా కరీంనగర్‌కు ఏం చేశారు? తల్లీబిడ్డల గురించి ఆయన అవమానకరంగా మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షనిగా సంజయ్ ని ఎందుకు తొలగించారో చెప్పాలి’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.మంచి రోజు కావడంతోనే కరీంనగర్‌లో తమ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు నామినేషన్‌ వేశారని, ఆయన అభ్యర్థిత్వంపై ఎలాంటి కన్ఫ్యుజన్‌ అవసరం లేదన్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్‌, పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్‌చార్జులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Spread the love