రైతులందరికీ రైతుబంధు వచ్చినట్టు నిరూపిస్తారా..

To all farmers Can you prove that Rythu Bandhu has come?– మా అభ్యర్థిని ఎన్నికల బరి నుంచి తప్పిస్తా
– లేదంటే.. మీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తారా : మంత్రి కోమటిరెడ్డికి మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాల్‌
నవతెలంగాణ -నల్లగొండ టౌన్‌
అర్హులైన రైతులందరికీ రైతుబంధు వచ్చిందని నిరూపిస్తే.. మా ఎంపీ అభ్యర్థిని ఎన్నికల బరి నుంచి తప్పిస్తా.. లేదంటే, మీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తారా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. కంచర్ల కృష్ణారెడ్డి రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం సెంటర్లో జగదీశ్‌రెడ్డ్డి మాట్లాడుతూ.. 100 రోజుల్లోనే ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఎన్నికలకు ముందు రైతుబంధు ఆపిన ఘనులు వీళ్లే అని విమర్శించారు. హామీల అమలుపై ఉప ముఖ్యమంత్రి భట్టి అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్పారని తెలిపారు. 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండి పంటలకు నీరందించలేకపోయారని విమర్శించారు. కేసీఆర్‌ తెచ్చిన పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో ఎన్ని వ్యవసాయ పంపు సెట్లు కాలాయో.. ఈ నాలుగు నెలల్లో ఎన్ని మోటార్లు కాలిపోయాయో లెక్క తీద్దాం అని సవాల్‌ విసిరారు. మిర్యాలగూడకు కేసీఆర్‌ ఏ మొఖం పెట్టుకొని వస్తారంటున్న మంత్రి కోమటిరెడ్డికి సిగ్గుండాలని విమర్శించారు. ఫ్లోరైడ్‌ పీడిత జిల్లాను ధాన్యాగారంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని తెలిపారు. కాంగ్రెస్‌ అన్నివర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు రవీందర్‌ కుమార్‌నాయక్‌, నాగార్జునసాగర్‌ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love