వనదేవతల దర్శనాలు సులువుగా..

– ఎండోమెంట్ కమిషనర్ వి అనిల్ కుమార్
– మేడారంలోని ఎండోమెంట్ అధికారులతో సమీక్ష
నవతెలంగాణ -తాడ్వాయి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు సులువుగా సాఫీగా వనదేవతల దర్శనాలు అయ్యేవిధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎండోమెంట్ కమిషనర్ వి అనిల్ కుమార్ అన్నారు. బుధవారం మేడారంలోని భక్తుల సౌకర్యార్థం ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ఎండోమెంట్ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా వి అనిల్ కుమార్ మాట్లాడుతూ మేడారం మహా జాతరకు వచ్చే సందర్శకుల సౌకర్యార్థం ప్రభుత్వం దేవదాయశాఖ 1.5 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. సందర్శకులు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా త్రాగునీటి సౌకర్యం టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు ఎక్కువ సేపు వెయిట్ చేయకుండా తొందరగా దర్శనం చేసుకునే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో రాజేంద్రం, ఎండోమెంట్ శాఖ డి ఈ రమేష్ ఏఈ స్థానిక మేడారం ఎండోమెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love