నవతెలంగాణ – కాటారం
వీ వో ఏల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శనివారం కాటారం మండల కేంద్రంలో వీ వో ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా గ్రామీణ స్థాయిలో సేవలు అందిస్తున్నప్పటికీ తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం అన్యాయమని మండిపడ్డారు.
ప్రస్తుతం అందుతున్న అతి తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కనీస వేతనాన్ని రూ.20 వేలుగా నిర్ణయించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తమను నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీ వో ఏలు చంద్రశేఖర్, సునీత, స్వరూప, శైలజ, ఓదెలు, బోడ బాపు, లలిత, రజిత, సిరివెన్నల తదితరులు పాల్గొన్నారు.


