వెయ్యి మంది బలగాలతో భారీ బందోబస్తు
నవతెలంగాణ–పరకాల
ఈనెల 16న తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన సజావుగా సాగేందుకు వివిధ ర్యాంకులకు చెందిన దాదాపు వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
వెయ్యి మందితో బందోబస్తు
బందోబస్తులో ముగ్గురు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 45 మంది ఎస్‌ఐలతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, సీఎం రాకపోకల మార్గాలు, వీఐపీ ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి
భారీ సంఖ్యలో ప్రజలు సభకు హాజరయ్యే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల ప్రవేశ మార్గాలు, బారికేడింగ్, అత్యవసర మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా ఉంచడంతో పాటు సభా ప్రాంగణంలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
శాఖల సమన్వయంతో ఏర్పాట్లు
పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే ప్రజలకు తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
సీఎం రేవంత్‌రెడ్డి పరకాలలో పూర్తయిన 100 పడకల ఏరియా ఆస్పత్రి, డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం పశువుల సంత మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటనకు సంబంధించి అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.



